వీరి వీరి గుమ్మడి పండు

Monday, November 18, 2013

ఆల్వాల్ శ్రీ వేంకటేశ్వర మహిళా మండలి వాళ్ళు రేడియోలో ఒక గంట ప్రోగ్రాం ఇస్తున్నారు. నాటకం, పాటలు, స్త్రీల ఆరోగ్యానికి కావలసిన పోషక పదార్థాల గురించి ఒక వ్యాసం, కొన్ని జోక్స్  మొదలైనవి ప్లాన్ చేసారు. ఒక నెల రోజుల ముందు నుండీ  ప్రతి రోజూ  జానకమ్మ గారి ఇంటి దగ్గర ప్రాక్టిస్ చేస్తున్నారు. అమ్మ గొంతు బాగుంటుంది కాబట్టి పాట వ్రాసుకుని పాడాల్సిందిగా ఆజ్ఞాపించారు. "పాటే కదా అని ప్రాక్టిస్ కి రావేమో, అన్నీ ఒకటి వెంట ఒకటి టయిము ప్రకారం రావాలి, అందుకని ప్రతి రోజూ నువ్వు రావడం మానకు" అని చెప్పారు అమ్మకి.     

ఆ తరువాత వారమే రేడియో స్టేషన్ కి వెళ్ళాల్సిన రోజు కావడంతో చాలా రిహార్సలు చేసేవారు. ఆ రోజు ఆదివారం అవడంతో అమ్మతో రిహార్సల్ కి నేనూ, చెల్లి కూడా వెళ్ళాం. చెల్లికి 5వ యేడు, నాకు 7వ యేడు. నాటకం రిహార్సల్ మొదలయ్యింది.  అది జరుగుతుండగా అన్నపూర్ణ గారొచ్చారు. ఈవిడ మా చెల్లి స్కూల్ లో టీచరు. టీచర్ ని చూడగానే మా చెల్లి కొంచెం భయం భయంగా అమ్మకి దగ్గరగా జరిగింది. "భయం లేదు ,టీచరు గారికి నమస్తే చెప్పు" అంది అమ్మ. "నమస్తే టీచర్" అంది చెల్లి చిలకలా, కొంచెం సిగ్గు పడుతూ. ఆవిడ హాయిగా నవ్వారు.ఆవిడ వెంట ఇంకో ఆవిడ కూడా వచ్చారు. "ఈవిడ మా తోటికోడలి తల్లి అండీ..మా తోటికోడలి పురిటికని వచ్చారు. మధ్యాహ్నం కాస్త తోస్తుందని తీసుకొచ్చా " అన్నారు అన్నపూర్ణ గారు. "నమస్కారమండీ" అన్నారావిడ. అందరూ చిరునవ్వుతో చూసారు. "రండి కూర్చోండి" అన్నది జానకత్త. 

నాటకం రిహార్సల్ కంటిన్యూ అయ్యింది.  నాటకం లో ఉన్నవాళ్ళందరూ ఒక దగ్గిర కూర్చున్నారు. వాళ్ళ వెనక జోక్స్ చదివేవాళ్ళు , ఆ తరువాత గోడ దగ్గరగా అమ్మా, మేమూ కూర్చున్నాము. ఆ వచ్చినావిడ అటువైపు వ్యాసం చదివే ఆవిడ పక్కన కూర్చున్నారు.

అమ్మ మధ్య మధ్య ఆ కొత్తావిడని చూస్తోంది. ఆవిడ కూడా అమ్మని అదోలాగా చూపు తిప్పకుండా చూస్తున్నారు. నేనెందుకో ఇద్దరి వైపు చూసా.నా కళ్ళకి ఇద్దరూ ఒకే లాగా కనిపించారు. నేను కొద్దిగా అయోమయంలో పడ్డా. అమ్మతో గుస గుసగా "అమ్మా ఆవిడ  నీ లాగే ఉన్నారు" అన్నా. అమ్మ కూడా " నాకూ అలాగే అనిపిస్తోంది" అంది ఇంకా గుస గుసగా. నాటకం పూర్తి  అయ్యింది, జోక్స్ చెప్పే వాళ్ళు, వ్యాసం చదివే ఆవిడ అయ్యాక అమ్మ పాడింది. "ఏడ నుంచీ రాక చందమామా, జాడ తెలియగ లేదు చందమామ" అనే అందమైన చందమామ పాట పాడింది అమ్మ. మ్యూసిక్ అవీ ఏం లేవు, సోలో సాంగ్.  రైటర్, కంపోసర్, సింగర్ అన్నీ అమ్మే. అన్ని కార్యక్రమాల మధ్య అమ్మ పాట ఎంత బాగుందో అని అందరూ మెచ్చుకున్నారు మొత్తం కార్యక్రమం అయ్యాక. "అన్నీ బానే వచ్చాయి, కానీ ఇంకా బాగా ప్రాక్టిస్ చెయ్యాలి. సరే మరి, రేపు మధ్యాహ్నం 2 కల్లా అందరూ వచ్చెయ్యండి, పిల్లలు ఇంటికొచ్చేటప్పటికి అవచేసేద్దాం" అన్నది భాస్కరమ్మత్త. అందరూ వెళ్ళిపోవడానికి లేచారు. 

కొత్తావిడ అమ్మ దగ్గరకొచ్చి, "మీ పాట భలే బాగుందండీ"  అన్నారు. అమ్మ చిరునవ్వు నవ్వింది. (అప్పట్లో థ్యాంక్యూలూ అవీ ఎవరూ వాడడం నాకు పెద్దగా గుర్తు లేదు) ."మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది.మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు కూడా ఉంది , మీది ఏ ఊరు" అని అన్నారావిడ. ఫలానా ఊరు అని అమ్మ చెప్పింది. "కొంప దీసి నువ్వు సరోజవు కాదు కదా" ఆశ్చర్యంగా అన్నారావిడ. అమ్మ ఇంకా ఆశ్చర్య పోయింది,  "నా పేరెలా తెలుసు మీకూ" అని!  "అయితే  నువ్వు.. ..నువ్వు సరోజవేనా " అని ఆవిడ గట్టిగా అరిచారు..."అవునండీ మీరు?" ఏదో గుర్తుకొస్తున్నట్టు అమ్మ కంఠం రుధ్ధమయింది.  "నేను సీతనే" అన్నారావిడ అమ్మ చేయి పట్టుకుంటూ.   అందరూ వింతగా చూస్తున్నారు. అప్పటికే  వీళ్ళిద్దరూ మాటల్లేకుండా  ఒకరి భుజాన ఒకరు తల పెట్టుకుని వెక్కి వెక్కి ఒకటే ఏడుపు. అవి ఆనంద భాష్పాలని అందరికీ అర్థం అయ్యింది కానీ, ఇద్దరూ వాటిని తట్టుకునే పరిస్థితిలో లేరు. అన్నపూర్ణ గారు ఖంగారు పడి," పిన్ని గారూ,పిన్ని గారూ " అని సీత గారి చెయ్యి లాగుతున్నారు. ఎవరో ఒకరు కల్పించుకోకపోతే లాభం లేదనుకుందేమో, భాస్కరమ్మ అత్త దగ్గరగా వచ్చి, "ఊర్కోండెహె...ఏమిటీ ఈ సస్పెన్సూ! సినెమాల్లో కంటే ఎక్కువగా ఉందీ, ఇంతకీ కథా కమామీషూ ఏంటొ చెపితే మేమూ ఆనందిస్తాంగా,  ఇలా ఏడుస్తూ మా అందరినీ ఏడిపిస్తే ఎలా "  అని పరాచకాలాడింది.  వెళ్ళబోతున్న వారంతా ఆగి చూస్తున్నారు. ఇద్దరూ వెక్కిళ్ళు ఆపి బలవంతంగా నవ్వారు.

 

సంగతేంటయ్యా అంటే వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ముల బిడ్డలుట.  ఉమ్మడి కుటుంబం . ఇద్దరికీ 3 నెలల వయసు తేడా. 13వ ఏట ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసారుట. పెళ్ళిళ్ళయ్యాక ఒక్క సారెప్పుడో ఇద్దరూ ఒకేసారి పుట్టింటికి వెళ్ళిన గుర్తుట. పెద్ద కుటుంబమవడం వల్ల  అమ్మకి పుట్టింటికి పెద్దగా వెళ్ళే అవకాశం రాలేదనుకుంటా. తరవాత ఇద్దరూ ఒక్కసారి ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళలేదుట. అమ్మమ్మ , తాతయ్య చనిపోవడం, నాన్నకి ట్రాన్స్ఫర్లవడం ఇత్యాది కారణాల వల్ల అమ్మ ఇద్దరన్నయ్యలు పుట్టాక పుట్టింటికి ఇంక వెళ్ళలేదు. ఫోన్లు అవీ లేని కారణంగా ఒకళ్ళ వివరాలు ఒకళ్ళకి తెలీలేదు. ఆ మాటకొస్తే చూచాయగా అమ్మ సికందరాబాదులో ఉంటోందని కూడా సీత పిన్నికి తెలీదుట.

అక్కణ్ణుంచీ ఇంక చెప్పేదేముందండీ..అక్కా వాళ్ళింట్లోంచి సీత పిన్ని మకాం మా ఇంటికి మారింది. అక్కా చెల్లెళ్ళిద్దరికీ పగలూ లేదు రాత్రి లేదు. ముప్ఫై ఐదేళ్ళ సంఘటనలు, ఊరి విషయాలు ఏ ఒక్క రోజు సంగతులూ విడవకుండా చెప్పుకుంటూనే ఉన్నారు.మాకు అర్థ రాత్రి ఎప్పుడు మెళకువ వచ్చి చూసినా ఇద్దరూ తెగ ముచ్చట్లు.  మాకూ ఒక కొత్తక్క దొరికింది.  బోనస్ గా చిన్నారి పాపాయి. పిన్ని ఊరెళ్లి పోయినా, అక్క బావ ప్రతి రోజూ సాయంత్రం బుజ్జి పాపాయిని తీసుకుని ఇంటికొచ్చేవారు. పిన్ని కూడా తరచుగా వస్తుండేది లెండి.ఏతా వాతా అన్నపూర్ణ గారంటే మా చెల్లికి భయం పోయింది. పాపాయి కోసం అక్కా వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా అన్న పూర్ణక్కా అంటూ పలకరిస్తోంది కూడా!

 

సినిమాల్లో చిన్నప్పుడు తిరునాళ్ళలో తప్పిపోయిన అక్కా చెల్లెళ్ళో , అన్నదమ్ములో  మళ్ళీ దొరికితే నవ్వుకుంటాం కానీ, నేను మాత్రం ఇలా ప్రాక్టికల్ గా చూశేసానండీ  అమ్మ ఆనందాన్ని. ఇద్దరినీ చూస్తే మాత్రం కవల పిల్లలేమో అనిపించేది. విశేషం ఏంటంటే, వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దో, ఎవరు చిన్నో ఇద్దరికీ గుర్తు లేదుట.  మేము వాళ్ళని సీత పిన్ని,  బాబాయని  పిలిస్తే, సీత పిన్ని పిల్లలు అమ్మా నాన్నని పిన్ని బాబాయ్ అని పిలిచేవారు.(తరవాతెప్పుడో, ఏవో పౌర్ణమి అమావాస్య లెక్కలేసి తేల్చుకున్నారు కానీ అప్పటికే టూ లేట్ అయిపోయింది. పైగా ఇలా పిలిపించుకోవడం వాళ్ళిద్దరికీ సరదాగా ఉండేది). 

 

అమ్మ పోయాక మేమూ దేశాలు పట్టి తిరుగుతూ, చుట్టాల గురించి పెద్దగా పట్టించుకో లేదు. మొన్న గుర్తొచ్చి మా చెల్లిని అడిగా "సీత పిన్ని ఎలా ఉందీ" అని. "అదేంటక్కా పిన్ని పోయి అప్పుడే మూడేళ్ళయిందిగా నీకు తెలీదా" అంది. ఫోన్ లు లేని అమ్మా వాళ్ళ కాలం కంటే వెనకబడి ఉన్నందుకు నన్ను నేను తిట్టుకున్నా. అంతకంటే ఏంచేస్తాం చెప్పండి!!!  

బ్లాగ్వనభోజనం: పాఠోళి

Saturday, November 16, 2013

పాఠోళి  ఒక ఒరియా వంటకం(ట) మన దగ్గరికి ఎలా వచ్చిందో కానీ, కూరలు లేవురా దేవుడా అనుకున్న టయింలో నేనున్నాగా అంటుంది. ఇంట్లో కూరలు లేనప్పుడు చక చకా చేసేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:
శెనగ పప్పు 1కప్పు
పెసర పప్పు 1 కప్పు
ఎండుమిరప కాయలు 12 ( మీ ఇష్టం మరి 3 నించి ఎన్నయినా వేసుకోవచ్చు)
జీల కర్ర
కరివేపాకు
ఉప్పు (సరిపడా)
నూనే పెద్ద గరిటెడు (ఇక్కడ హెల్త్ కాన్షియస్ అన్నారంటే మాత్రం దేవుడే మిమ్మల్ని కాపాడాలి) !
ఇంగువ చిటికెడు (ఇష్టమైతేనే)

శెనగ పప్పు, పెసరపప్పు కడిగేసి నీళ్ళల్లో నానబెట్టాలి.
మిరపకాయలు కూడా కడిగేసి వాటితో నానబెట్టాలి.
2 గంటల తరవాత, యీ మూడింటిని ఉప్పు వేసి మెత్తగా దోసెల పిండిలా రుబ్బుకోవాలి.
పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసి వేడి చేయాలి.
జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి కలపాలి. నూనె మిశ్రమం మొత్తానికి అంటేలా కలిపి, సిం లో పెట్టి మూత పెట్టాలి. ప్రతి 5 నిమిషాల కొక సారి  కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. అరగంట పైగా పడుతుందనుకోండీ, కొచెం ఓపిక కావాలి మరి !
బాగా మగ్గిందనిపించాక గిన్నె లోకి తీసుకుని గరిటతో ఒక సారి మెదపాలి. పక్కన చారు/రసం పెట్టుకుంటే అన్నం లోకి చాలా బాగుంటుంది.
(కొంతమంది మెంతి ఆకులు కూడా వేస్తారుట, నేనెప్పుడూ వెయ్యలేదు.)

ఎప్పుడైనా నాన బెట్టిన శెనగలు ఉండి అవి పాడైపోతాయనుకుంటే, వాటితో కూడా ఇదే పద్దతిలో పాటోలీ/
పాఠోళి చేసుకోవచ్చు. కొంచెం రుచి తేడా తో అది కూడా చాలా బాగుంటుంది.

ఈ సారి అనేక కారణాల వల్ల పుట్టిన రోజు జరుపుకోవట్లేదు నేను, అందుకని వనభోజనాల్లో భోజనం చేసేసి, నన్నో సారి శతమానం భవతి అని దీవించెయ్యండి మరి! (ఇలా అనుకుంటా కానీ సంవత్సరానికి పట్టుమని పది టపాలైనా వ్రాయట్లేదు, అందుకే మరి మీ దీవెనలత్యవసరం, దీవించేస్తారుగా!)

బుడ్డోడు

Sunday, November 3, 2013

ఎండాకాలం సెలవల్లో సాయంత్రం అందరం బయట అరుగు మీద కూచుని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంటి ముందు లారీ ఆగింది .  అందరం అటువైపు చూసాము. ఇంటి ముందర ఉన్న ఖాళీ ఇంట్లోకి ఎవరో వస్తున్నట్టున్నారు. ఇద్దరు మగ వాళ్ళు దిగారు.  ఇంటి వైపు వస్తూ, 
 " కాశీకర్ గారితో మాట్లాడామండీ తాళాలు మీ ఇంట్లో తీసుకోమన్నారు" అని చెప్పారు ఒకాయన. "రండి రండి" అని లోపలికి పిలిచారు నాన్న. అమ్మ తాగడానికి  నీళ్ళు తెచ్చింది . ఈ లోపు పిల్లలూ ఆడవాళ్ళు దిగి అక్కడే నించున్నారు. "రండమ్మా నీళ్ళు తాగుదురుగానీ " అని పిలిచింది అమ్మ. "మేము ఇద్దరం అన్నదమ్ములమండీ మిలటరీ లో పని చేస్తున్నాము. బరేలి నించి ఇద్దరికీ ఇక్కడ ఎం సి ఈ ఎం ఈ కి వేసారు. స్నేహితుడొకడు చూపించాడు ఈ ఇల్లు. మా స్వస్థలం రాయలసీమ"  అని చెప్పారు పెద్ద రెడ్డి గారు. అందరూ  అరుగు మీద కూర్చున్నారు. అయిదుగురు పిల్లలు. రాజ్య లక్ష్మి, భాగ్య లక్ష్మి, నరసింహా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డీ అని గబా గబా పేర్లు చెప్పుకున్నారు మొదటి నలుగురు.  పెద్దాయనకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు, చిన్నాయనకి ఇద్దరు మగ పిల్లలు అని చెప్పారు.  అందరిలోకీ చంటాడు  రెండేళ్ళవాడు . మూతి  సున్నాలా పెట్టి అదోరకం చప్పుడు చేస్తున్నాడు. అమ్మ పిల్లలకి మురుకులు పెట్టింది . నీ పేరేంటీ అని అడిగాన్నేను. అదే పనిగా   చప్పుడు చేస్తున్నాడు.  "బుడ్డోడా" అని పిలిచారు నాన్న .  ఠక్కున చూసాడు. అప్పటి నించీ వాడికి అదే పేరు. అసలు పేరు రాజశేఖర్ రెడ్డి (ఏమో ఇప్పటికీ నాకు సరిగ్గా తెలీదు) అయ్యుండొచ్చు.

నరసింహ , బుడ్డోడు ఒకే పోలికతో ఉండడం మూలాన ఇద్దరు చిన్న రెడ్డి గారి పిల్లలని మేము అనేసుకున్నాము, చాలా రోజులకి గానీ తెలీలేదు చందూ , బుడ్డోడు సొంత అన్నదమ్ములని. వచ్చీ రావడం తోనే కాలనీలో రెడ్డి సహోదరులు తెగ ఫేమస్ అయిపోయారు. అన్నదమ్ములిద్దరికీ ఇంకో స్నేహితుడు అక్కర్లేదు. ఇంటికొస్తూనే ఇద్దరూ మేడ మీద కూర్చుని చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. పెద్దావిడ క్రోషా అల్లుతారు. దానికి కావలసిన దారం టోకున కొనుక్కొచ్చి అన్నదమ్ములిద్దరూ ఖాళీ సమయాల్లో చిక్కులు పడకుండా దారాన్ని కండెలకి చుట్టి పెడతారు. అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అవడం వల్ల  కావచ్చు చాలా సరదాగా గడిపేస్తారు. పిల్లలకి కూడా ఇంకోళ్ళ ఇంటికెళ్ళే పని లేదు. వాళ్ళకి వాళ్ళు చాలు. భయ భక్తులతో ఎక్కువ అల్లరి చేయకుండా ఆడుకుంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలైనా బావగారికి, మరదలికీ జరుగుతాయి తప్ప ఇంక ఇంట్లో ఎవ్వరూ మాట్లాడరు. మళ్ళీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వదినా మరుదులు మాత్రం ఏమీ కానట్టే ఉంటారు. మగ వాళ్ళు ఆఫీసులకి, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాక, అక్క చెల్లెళ్ళు బుడ్డోడిని తీసుకొచ్చి మా ఇంట్లో కూచుని అమ్మతో కబుర్లు చెప్పేవారు. నాన్న ఏవో ఆధ్యాత్మిక విషయాలు చెప్తుంటే వినడం వాళ్ళకి ఇష్టం . బుడ్డోడు మాత్రం మా అందరికీ తెగ అలవాటయ్యాడు. పై నలుగురూ పరిగెత్తే ఆటలాడుకుంటుంటే, బుడ్డోడు మాత్రం మా ఇంట్ళొకొచ్చి టీవీ పెట్టమని నాన్నని అడిగి దాని ముందు అలా సెట్టిల్ అయ్యేవాడు. చీకట్లో కళ్ళు మెరిపిస్తూ టీవీ  చూస్తూ అలానే నిద్రపోయేవాడు. అందరం బాగా ముద్దు చేసేవాళ్ళం . ఇంట్లో ఏం  చేసినా బుడ్డోడికి పెట్టావా అని అడిగేవారు నాన్న.


రెడ్డిగారింటికి ఎవరో చుట్టాలొచ్చారు  రెండు రోజులుగా ఎవరూ ఇటువైపు రాలేదు. కాలేజీ నించి నేను ఇంటికొచ్చేటప్పటికి అమ్మ చెల్లితో  "పొద్దున్న మన మేడ మీద స్థలం సరిపోక , రెడ్డి గారింటి మేడ మీద కూడా వడియాలు పెట్టాను. మన మేడ మీదవి నేను తెస్తా ,మబ్బు పట్టేట్టుంది అక్కా నువ్వూ వెళ్లి రెడ్డి గారి మేడ మీద వడియాలు పట్టుకొచ్చెయండి"  అంది . సరే అని పైకి వెళ్లి వడియాలు తీసాము. ఈ లోపు బాగా నల్ల మబ్బు పట్టింది. ఏ నిమిషాన అయినా వాన రావచ్చు. పైన ఒక పక్క రెడ్డి గారి భార్య బొంతలు, రగ్గులు ఎండకి వేసి మర్చిపోయినట్టున్నారు. వాళ్ళు బిజీగా ఉన్నారుగా. మడత పెట్టి కింద పెట్టేస్తే తీరిక అయ్యాక తీసుకెళతారులే అని నేను చెల్లి అన్నీ మడత పెట్టేస్తున్నాము .(అప్పట్లో గుడ్ గాళ్ల్స్ అని పేరు తెచ్చుకోడానికి ఇలాంటివి చెయ్యక తప్పేవి కావు మరి!) ఇంతలో రెడ్డి గారు ఇంట్లోంచి పెద్దగా" అమ్మా బుడ్డోడున్నాడా ఆడ" అని అరిచారు. "లేడంకుల్ ఇక్కడ" అన్నాను నేను.
"ఏంటి అంకుల్ బుడ్డోడు ఇంటివైపు  రాలేదసలు "అన్నాన్నేను. "నాన్న కూడా అడిగారు ఇవాళ రాలేదేంటని "అంది చెల్లి . "చాలా సేపటి నుంచీ కనిపించట్లేదమ్మా. అక్కా వాళ్ళ ఇంటికాడ ఉన్నాడేమో కొంచెం  చూస్తారా" అన్నారాయన. వడియాలూ , మడత పెట్టినంత వరకూ బట్టలూ తీసుకుని కిందకి పరిగెత్తాము. అందరం తలో వైపూ వెతుకుతున్నాము .  చాలా సేపు కనిపించకపోతే మా ఇంట్లో ఉండి ఉంటాడులే అనుకున్నారుట. పెద్ద రెడ్డి గారు మాత్రం అరుస్తున్నారు. పిల్లోడు ఎక్కడున్నాడో చూసుకోవక్కరలేదా అని. నాన్న మాత్రం ఖంగారు పడకండి రెడ్డి గారూ ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు  అన్నారు. ఇంటి వెనక చెరువు ఉంది. అటు కొందరు వెతికి వచ్చారు. కొత్తగా ఇళ్ళు కడుతూ ఉండడంతో చాలా వరకూ నీళ్ళ  బావులు తవ్వుతూ వదిలేసి ఉన్నాయి. 
చెరువు నీళ్ళు పారే చోట లోయలా ఏర్పడింది. అది కాక వెనక అంతా ఖాళీ ప్రదేశం. ఇవన్నీ కాక ఆ మధ్యే పిల్లలని ఎత్తుకుపోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. చిన్న రెడ్డి గారు మాత్రం బావుల దగ్గరికెళ్ళి పెద్దగా వాడిని పిలుస్తూ తొంగి చూస్తున్నారు. అందరం తలో వైపూ పరిగెత్తి మళ్ళీ ఇంటి దగ్గరికొస్తున్నాం ఏమైనా తెలిసిందేమోనని.  చాలా మంది రెడ్డి గారి ఇంటి ముందు నిలబడ్డారు. పోలిస్ రిపోర్ట్ ఇచ్చి వచ్చారు .  ఎవరికీ వాళ్ళు ఫలం, పుష్పం,తోయం,ఉపవాసం, కొబ్బరికాయలు, ప్రదక్షిణలు, వడమాలలు మొక్కేసుకున్నారు వారి వారికి ఇష్టమైన దేవుళ్ళకి. చీకటి పడింది. ఇంకొక్కసారి మళ్ళీ వెతికిన చోటే వెతికి రమ్మని నాన్న అందరికీ చెప్పబోయారు. చిన్న రెడ్డి గారొచ్చి, " వద్దు నాయనా, ఇంకెందుకు అందరికీ కష్టం, వాడు ఇంక మనకి లేడు, పొద్దున్నే కిష్టయ్యని పిలిచి బావిలల్ల వెతికిద్దాం కనీసం చివరి చూపు చూసుకోవచ్చ"ని అన్నారు. ఈ మిలటరీ వాళ్ళు బంగారంగాను ఇంత  మాటనేసినాడు!  అక్కడున్న వాళ్ళన్దరూ బోరుమని ఏడ్చారు. బాగా చీకటయ్యక ఎవరింటికి వారు వెళ్ళారు కానీ ఎవరికీ తిండీ నిద్రా ధ్యాస లేదు. అలా కూర్చుని వాడి కబుర్లే చెప్పుకుంటున్నాము.
 

ఇంతలో వాన మొదలయ్యేట్టుంది , జల్లు లోపలికి రాకుండా తలుపు దగ్గరికి వేసాము. అసలే దుఃఖం పైగా ఆకాశం కూడా ఏడవడానికి సిధ్ధపడుతున్నట్టుంది .  నాన్న దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు వాళ్ళు తట్టుకునేట్టు చూడమని. ఈ లోపు బయట కలకలం వినిపించింది. పోలీసులొచ్చినట్టున్నారు. అందరం బయటికొచ్చాము. పోలీసులు ప్రశ్నలడుగుతున్నారు. బుడ్డోడి ఫొటో ఇమ్మన్నారు. ఇల్లు వెనకా ముందూ అంతా చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.  వర్షం మొదలయ్యింది. "మే బట్టలున్నయేమొ మిద్దె మీన " అంది వాళ్ళ చుట్టాలావిడ. "అన్నీ తెచ్చేసామాంటీ ఒక్క దుప్పటి మాత్రం మిగిలింది తెస్తా ఉండండి" అని చెల్లి పైకి పరిగెత్తింది. 2 నిమిషాల్లో చెల్లి పెద్దగా అరిచింది. రెడ్డి గారు పైకి పరిగెత్తారు. రెడ్డి గారు అందరినీ  పిలుస్తున్నారు పిల్లోడు దొరికాడని .   ఒక్క సారిగా అందరం ఆనందంతో అరిచాము. ఎక్కడ దొరికాడు అని ! "మీన  దుప్పట్లు ఎండేసినారుగా ఆటి  కింద నిదురబోయినా డేమో, చినుకు పడంగల్నె ఏడుపు ఎత్తుకున్నాడు " పెద్ద రెడ్డిగారు ఆనందం పట్టలేక పోతున్నారు. "అదేన్దబ్బా పిల్లోల్లు మీనకేంచి  బొంతలు తెస్తిరిగా "అన్నది వాళ్ళ చుట్టాలావిడ. "అవునండీ కానీ ఒకటే దుప్పటి మిగిలి పోయింది. అదొక్కటీ తీసే లోపు పెద్దంకుల్ బుడ్డోడు కనిపించట్లేదని చెప్పారు. అయినా ఆ దుప్పటి కింద వాడు ఉన్నట్టు అసలు తెలీలేదు, కదా" అని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ చెల్లీ, నేను సంజాయిషీ ఇచ్చుకున్నాము. అసలింత గోల జరుగుతున్నా వాడికి మెళకువ రాకపోవటం అందరినీ ఆశ్చర్య పరిచింది . "ఎండకు సొమ్మసిల్లి ఉంటాడు మే, సన్న పిల్లోడు గదా "అన్నది చుట్టాల్లో పెద్దావిడ." ముందర అన్నం పెట్టండమ్మా " అన్నారెవరో. "చిన్నమ్మా ఉండు వాడికి దిష్టి తీస్తా అందరి కళ్ళళ్ళొ పడ్డాడు చిన్ని తండ్రి" అంది అమ్మ. అందరం తెగ ఆనంద పడి ఎవరి మొక్కులు వాళ్ళు చెల్లించుకున్నాము. అంతే  కాకుండా దుప్పట్లో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా వెతికారట అనే సామేత మళ్ళీ ఋజువయ్యిందని మర్నాడు ఊర్లో అందరూ చెప్పుకుని నవ్వుకున్నారు.

మొన్న ఆదివారం ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవ్వరూ తియ్యలేదు ఇంట్లో . కొంచెం భయపడి మళ్ళీ మళ్ళీ చేసా. మర్నాడు ఉదయం అక్క తీసింది ఫోను. "ఏంటీ ఫోన్ తియ్యరూ, నాన్న ఎలా ఉన్నారో అని ఎంత ఖంగారు వేసిందో ఎక్కడికి పోయారందరూ "అని విసుక్కున్నా. "అదేంటే, బుడ్డోడి పెళ్లి కదా అందరం వెళ్ళాము నీకు చెప్పమని మరీ మరీ చెప్పారు, అక్క చెప్పలేదా అంది". వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుని కొంచెం దూరం గా ఉన్న మూలాన ఈ 25 యేళ్ళుగా నేను వాడిని  కలవలేదు. దేనికో మధ్యలో ఒకసారి వాళ్ళింటికి వెళ్ళా కానీ బుడ్డోడు లేడు  ఇంట్లో. "అంత  పెద్దాడయ్యేడావే " అన్నా ఆశ్చర్యంగా ."గుర్తుందా నీకు వాడి చిన్నప్పుడు "అని మొదలెట్టింది.
" అబ్బా!అది మర్చిపోయే విషయమా తల్లీ కళ్ళకు కట్టినట్టుంది"  న్నాన్నేను. "మరింకేం  వ్రాసి పెట్టు వాడికి చూపిస్తా "అంది అక్క.  అందుకని మొదలెట్టేసినానబ్బా. మీరూ మా బుడ్డోడిని నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని దీవించెయ్యండి మరి !