ఇంటెల్ " లేడీ "

Wednesday, September 28, 2016


అత్తయ్యా అత్తయ్యా
................
ఏంటో కట్ అయినట్టుంది చూడండి..
అమ్మా అమ్మా
.............
అమ్మ ఫోన్ కనెక్ట్ కావట్లేదు.  అంటూ బుజ్జాయి ఫోన్ కి ట్రయి చేస్తున్నారు. . 

ఫోన్ కార్డులు కొనుక్కుని గంటలు గంటలు మాట్లాడ్డం అలవాటయ్యింది మా ఇద్దరికీ. ఈ మధ్యనే ఎందుకో సరిగా మాట్లాడడం అవట్లేదు. ఫోన్ మాటిమాటికీ కట్ అవుతోంది. వర్షాల వల్లనో ఎక్కువమంది మాట్లాడే టయిములో మాట్లాడడం వల్లనో అని రీసనింగ్స్ ఇచ్చుకుంటున్నాం గానీ అలా ఎందుకు కట్ అవుతోందో తెలియదు. ఆరా తీస్తే ఫోన్ కింద పడిందని తెలిసింది. ఒక స్నేహితురాలు వెళుతుంటే ఫోను కొని పంపించాము. అది అంది ఉంటుందీపాటికి వాడేస్తూ ఉంటారు మళ్ళీ మామూలుగా మాట్లాడేసుకోవచ్చని వెయిటింగు .

మాటలంటే గంటలు గంటలు మాట్లాడేస్తా కానండీ నేను టెక్నాలజీ లో పరమ పూరు. నాకు ఓల్డు ఈస్ గోల్డు. నా చిట్టి ఫోన్ ని వాడేస్తానే తప్ప కొత్తవి కొనుక్కోమంటే కోపమొచ్చేస్తుంది. కంఫర్టు ముఖ్యం పాతది బానే పనిచేస్తున్నప్పుడు కొత్తది మార్కెట్లోకి వచ్చిందని కొనెయ్యడమేనా అని చిరాకు పడిపోతాను కూడా. మొన్ననే కొత్తగా కెమేరా ఉన్న ఫోన్ లు వచ్చాయని అంటగట్టాడు రోజర్స్ వాడు. ఎవరో ఇంటికెళుతుంటే మా చెల్లికి పంపేసా అప్పుడెప్పుడో మాటల్లో కెమేరా ఫోన్ భలే ఉంటుందక్కా  అందని.


అమ్మా నీ ఫోన్ కి ఏమయింది.

కింద పడి విరిగింది గా నాన్నా అప్పుడప్పుడు లూస్ కనెక్షన్ అవుతుంటుంది

అదేంటీ కొత్త ఫోన్ ఇంకా వాడట్లేదా


ఇంకా లేదు 

అదేంటి అమ్మా మొన్న శాంతి గారితో పంపించిన ఫోన్ ఏమయ్యిందీ

ఏమో నాన్నా  అదిక్కడ అన్లాక్ అవలేదు..

అయ్యో అలాగా...నీ కోడలు  వస్తోందిగా ఇంకోటి ఇక్కడ అన్లాక్ చేయించి పంపుతాలే.అప్పటి వరకూ బుజ్జాయి ఫోన్ కి చేస్తుంటాము ..

అలాగేలే నాన్నా తొందరేమీలేదు

అలా మరో వారం లో నేను బయల్దేరి వెళ్ళిన  నా భారత దేశ యాత్ర  మీకు తెలుసు కదా !


అలా వెళుతూ వెళుతూ మా సీతయ్య కొనిఅన్లాక్ చేయించి ఇచ్చిన ఫోన్ ఒకటి పట్టుకెళ్ళా..బట్ ఎందుకో అది కూడా అక్కడ పని చేయ్యలేదు. బజార్లో నాలుగైదు చోట్ల తిప్పినా అది మొండికేసింది. సీతయ్య తో చెప్పగానే, అమ్మకి ఒక ఫోన్ కొనియ్యి అక్కడే చూసి అన్నారు. సరే అలా సర్ప్రయిజ్ చేద్దాంలే అనుకున్నా. ఒక సాయంత్రం చుట్టాలింటికెళ్ళి వస్తున్నాం.  వెతగ్గ వెతగ్గా ఒక ఆటో దొరికింది. ఆ అబ్బాయి మా ఇంట్లో వాళ్ళకి తెలుసుట మా ఇంటి దగ్గరే ఉంటాడుట లెండి.. మధ్యలో కొంచెం ఆగాలి సాగర్ అన్నాను. ఫర్వాలేదు అక్కా ఎక్కడ ఆపాలో చెప్పండి అన్నాడు.  నెను చెప్తాలే పద అని దారిలో ఏవైనా ఫోన్  అమ్మే దుకాణాలు కనబడతాయా అని చూస్తున్నా. స్కూల్స్ విడిచే టయిము దారంతా బాగా రష్ గా ఉంది. మధ్యలో  ఎక్కడా ఆటో ఆపడానికి వీలు అవలేదు. అటూ ఇటూ చేసి గోల్నాకా వచ్చేసింది. ఇంకో స్టాప్ దాటితే మా ఇల్లు వచ్చేస్తుంది.. రేపు నా ప్రయాణం..ఇప్పుడు తప్పితే ఫోన్ కొనడానికి కుదరదు.


రోడ్డంతా వెతుకుతున్నా ఎక్కడైనా ఫోన్ కొనచ్చేమోనని. గోల్నాక చౌ రాస్తా దగ్గర ఒక దుకాణం కనబడింది. అన్ని రకములైన ఫోన్ లు అమ్మబడును, రిపెయిర్లు కూడా చెయ్యబడును అని. సరే అని అత్తయ్యా మీరు, వల్లి ఆటో లో కూర్చోండి..ఇక్కడ ఫోన్ అన్ లాక్ చేస్తాడేమో అడిగి వస్తా అన్నా. సరే అన్నారు. నేను లోపలికెళ్ళి ఫోన్ చూపించా..నాకు తెలుసు అది ఇంక అవ్వదని...సరే అన్ లాక్ సంగతి వదిలి కొత్త ఫోన్ చూపించమన్నా. ఎవరికండీ ఏ రేంజ్ లో అని అడిగాడు. అదిగో ఆటో లో కూచున్నారే ఆవిడకి అని చూపించా. తొంగి చూసి, పెద్దావిడకా అని..పెద్ద పెద్ద అక్షరాలున్న ఫోన్ చూపించారు. కాదమ్మా మామూలువె చూపించండి అన్నా.. చూపించిన వాటిలో నా తెలిసున్నంత వరకు మంచిది అని అనిపించినవి మూడు పక్కన పెట్టి, చెల్లిని అత్తయ్యనీ లోపలికి పిలిచా...

వీటిలో మీకు నచ్చింది తీసుకోండి  అత్తయ్యా అన్నా. ఇవే ఉన్నాయా అన్నారు అత్తయ్య. ఇంకా చాలా ఉన్నాయండీ అని ఇంకా చాలా చూపించారు షాప్ వాళ్ళు  . టచ్ స్క్రీన్ లేవా అని అడిగారు అత్తయ్య. ఆ పిల్లాడు అమాంతం నోరు తెరిచాడు. ఆవిడ పలికే తీసుకి తెగ మురిసిపోయి ఉన్నాయి ఆంటీ అని వాటిని తెచ్చి చూపించాడు.. నాకు వాటి గురించి పెద్దగా తెలియదు కాబట్టి, నేను పక్కన నించుని చూస్తున్నా. అత్తయ్య వాటిని పరీక్షగా చూసి, ఒకటి సెలక్ట్ చేసారు. ఇది బాగుంది కదూ అని నన్నూ వల్లినీ అడిగారు. మేమిద్దరం తెల్లమొహాలేసి, దాంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయో లేదో చూడాడం మాకు తెలీదత్తయ్యా, బుజ్జాయిని రమ్మని ఫోన్ చేద్దాం అన్నా. అత్తయ్య పట్టించుకోకుండా ఫోన్ ని చూస్తున్నారు.   ఈ లోపు ఆ షాప్ కుర్రాడు ఆంటీ ఆగండి, మీకు దీన్ని ఎలా వాడాలో చూపిస్తా అని తాపత్రయ పడ్డాడు. దాంట్లో చూపించడానికేముంది నాయనా..ఇక్కడ నొక్కితే ఓపెన్ అవుతుందీ..ఇలా స్క్రోల్ చేస్తే కాంట్టాక్ట్స్ వస్తాయి, ఇది నొక్కితే పాటలొస్తాయి అని టపా టపా అన్నీ ఆ అబ్బాయికి చూపించేసారు అత్తయ్య. ఆ అబ్బాయి చూపిచ్చిన ఎక్స్ప్రెషను చూసి అక్కడున్న 4గురు సేల్స్ పిల్లలూ, షాప్ ఓనరానీ కూడా మా దగ్గరికి వచ్చేసారు. నలుగురూ అడిగిన ప్రశ్నలకి అత్తయ్య అష్టావధాని లాగా జవాబులు చెప్తున్నారు. ఈ హంగామా విని లోపల రిపెయిర్ పని చేసుకుంటున్న ఇద్దరబ్బాయిలు, ఆటో అబ్బాయి కూడా కుతూహలం గా వచ్చి నించుని చూస్తున్నారు.

ఇంతలో అత్తయ్య ఇది ఎన్ని జీబీ అని అడిగారు. డేటా కార్దు అవీ ఇవీ అన్నీ అడుగుతున్నారు. బుజ్జాయిని పిలవక్కరలేదని మా ఇద్దరికీ అప్పటికే అర్థమయిపోయి చూస్తూ ఉన్నామంతే.
అన్నీ అయిపోయాయి. ఓనరు గారు ఫోన్ ప్యాక్ చేసేస్తూ, ఆంటీ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది... మీకు 2 జీబీ ఎక్స్ట్రా ఇస్తా..రేపు పొద్దున్న ఎవరినైనా పంపండి మీకు కావలసిన పాటలన్నీ పెట్టిస్తా, మీకు ఏం పెట్టమంటారు.. సుప్రభాతం, విష్ణుసహస్రనామం పెట్టనా అన్నాడు. అవి నా దగ్గర ఉన్నాయమ్మా. వీలైతె మంచి పాటలు పెట్టు అన్నారు అత్తయ్య. సరే లెండి ఘంటసాల భక్తి గీతాలు పెడతా అన్నాడా అబ్బాయి. అబ్బే ఆ కలెక్షనంతా ఉందమ్మా..కావాలంటే మంచి కొత్తపాటలు పెట్టు అంటూ కొత్త సింగర్ల పేర్లేవో చెప్పారు అత్తయ్య. సారీ అండీ నాకు కొత్త ఆ సింగర్ల పేర్లు తెలియక పోవడం వల్ల మీకు చెప్పలేకపోతున్నాను. నా అజ్ఞానానికి అప్పటికే నేను బోల్డు చింతిస్తున్నా.ఇంక మీరు మరీ జెనరల్ నాలెడ్జీ కొచ్చన్లు అడక్కండి నేను హర్ట్ అవుతా...!

ఇంక ఫోన్ తీసుకుని వస్తుండగా షాప్ పిల్లాడొకడు.." అంటీ చివరాకరగా ఒక ప్రశ్నా , మీకు ఇవన్నీ ఎలా తెలుసూ, మీ కోడళ్ళకి కూడా తెలిసినట్టు లేదూ " అన్నాడు. అదేముంది నాయనా, నా కోడళ్ళకంటే, ఇంటి పనులు, పిల్లలు, చదువులూ ఉంటాయి. నాకు అలా కాదుగా.. నా మనవలందరూ పెద్ద పెద్ద చదువులు చదువుతారు. వాళ్ళకి తగ్గట్లు నేను ఉండాలా వద్దా అందుకే నేర్చుకున్నా..అయినా ఇదేమన్నా బ్రహ్మ విద్యా.. అని అంటూ చిరునవ్వుతో అందరికీ బై చెప్పి ఆటో లో కూర్చుని ఫోన్ సెట్ చేసుకుని అందరికీ కొత్త నంబరు ఇచ్చే ప్రయత్నం లో పడ్డారు అత్తయ్య.

ఈ సంఘటన్ని మా ఆఫీస్ లో అందరూ  మరీ మరీ గుర్తు చేసుకుంటుంటారు.. మొన్ననే మా  బాస్ అడిగింది...ఎన్నెలా , మీ అత్తయ్యకి ఇంకా ఐపాడ్ కొనలేదా అని...కొంటానండీ కానీ ఇప్పట్లో ఇంటికి ఎవరూ వెళ్ళట్లే..వెళితే తప్పకుండా పంపిస్తా అన్నా.. మరి ఆవిడకి వాడడం వచ్చా అని కొత్తగా వచ్చిన కొలీగ్ ఒకావిడ అడిగారు. పైన జరిగిన ఫోన్ కథ పూస గుచ్చినట్టు చెప్పారు మా బాస్ గారు. అమ్మో వెంటనే ఈ కథ మా అమ్మకి చెప్పాలి..ఎప్పుడూ తోచదంటుంది..ఏదైనా  కొనిస్తే వద్దంటుంది.. మీ అత్తయ్య దగ్గరికి పంపనా అని అడిగారావిడ. పంపండి కానీ జమైకా నించి ఇండియా కి టికెట్ మాత్రం మీదే సుమా అని నవ్వాన్నేను.

( 2012 లో కథ వ్రాసి పెట్టి  ఏ కారణం వల్లో మరి పోస్ట్ చెయ్యడం మరచిపోయాననుకుంటా. విమల గారి కామెంటు పుణ్యమాని నా బ్లాగ్ ని చాలా రోజుల తర్వాత చూసాను. అరె ఇక్కడొక డ్రాఫ్ట్ ఉందే అని చూస్తే పోస్ట్ చెయ్యడానికి రెడీగా కనిపించింది. . ఇలా గుర్తుచేసుకునే అవకాశం వచ్చినందుకు బోల్డు ఆనందంగానూ ఆవిడని కోల్పోయినందుకు బోల్డు దుఖం గానూ ఉంది)

పంచాంగం

Thursday, July 30, 2015

22 ఏళ్ళ నించీ (దాదాపు నేను పుట్టినప్పటి నించీ అన్నమాట) ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణం చేస్తున్నా. ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతాయి లెండి. అప్పట్లో  టీవీ లూ అవీ లేవుగా అదే కాలక్షేపం. 

అందరకీ ఏమో కానీ నాకెప్పుడూ ఆదాయం 0 వ్యయం 34 అని వచ్చేది. చిన్న పిల్లని కదా సంపాదించడం లేదు మరి పవుడర్లకీ, గోరింటాకు కీ ఆ మాత్రం ఖర్చు సహజమే అనుకునేదాన్ని. పెళ్ళయ్యాక లెక్క మారలేదు కానీ పరుసు మారింది. మా అయ్యవారి పర్సు బదులు ఆయనగారి పర్సు.. ఆహ్ పోనీలే అనుకున్నా. 


ఈ ఆదాయ వ్యాయాలకి తోడు  రాజ పూజ్యం 1, అవమానం 15 అని ఉంటుంది. చిన్నప్పుడు పెద్దగా అవేంటో అర్థం అయ్యేవి కావు కానీ  కొంచెం లోక జ్ఙానం వచ్చాక .."చ.. ఇన్నేళ్ళుగా అవే రిసల్ట్సా!! దేవుడా కొంచెం తిరగెయ్యొచ్చుగా" అని వేడుకున్నా. మిస్టర్ పెళ్ళాం సినెమా ఎన్నిసార్లు చూసాడో ఆయనకీ మాంచి తెలివితేటలొచ్చేసాయి. యీ సారి ఆదాయం 1 వ్యయం 15 కాగా రాజపూజ్యం 0, అవమానం 34 అని వచ్చింది.. ప్చ్ ప్చ్..

మాలిక పత్రికలో నా కథ "బొమ్మల పెండ్లి"

Monday, June 8, 2015

యాస చదవడం కష్టమని స్నేహితులు అంటున్నప్పుడల్లా వెనుదీస్తూ ముందుకు సాగమన్న మనసు మాట వింటూ ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి వెళుతూ అప్పుడప్పుడు అయినా నాకిష్టమైన యాసలో కథలు వ్రాయాలి అని నిర్ణయం తీసుకున్నందువల్ల చిన్నప్పటి ఙ్ఞాపకాలతో సాగిన ఈ కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్పవలసిందిగా మిత్రులని కోరుతున్నా. 
కథ చదువుతున్నప్పుడు మీకు మీరు చేసిన/చూసిన  బొమ్మలపెళ్ళి గుర్తుకి వచ్చిఆనందంతో కానీ కథలోని వేదనతో కానీ మీ కంటి నించి ఒక చుక్క నీరు కారితే  చాలు నా కథకి సార్థకత చేకూరినట్టే .

Story line: చక్కగా బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకుంటూ అయోమయంగా, అమాయకంగా  అన్ని వస్తువులతో ఆడుకునే 10 మంది స్నేహితుల గుంపులో ఉన్న అక్కా చెల్లెళ్ళ  తల్లి బిడ్డని కని చనిపోయింది. పిల్లలని బాగా చదివించాలనే కోరికతో ఉన్న తల్లి చనిపోవడంతో  బొమ్మల్లాంటి అక్కచెల్లెళ్ళకి 10, 12 వ ఏట పెళ్లయిపోయింది. తండ్రి ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. వచ్చినావిడ చంటి పిల్ల ప్రభని సొంత తల్లిలా పెంచింది. తీరా ప్రభకి 10 ఏళ్ళు రాగానే దానికీ పెళ్ళి చేసెయ్యాలని తండ్రి తపన.  చదువే ప్రాణం గా పెంచుతున్న తలితండ్రులున్న  ఒక పిల్లకి ఆ పెళ్ళి ఆపాలని తాపత్రయం. ప్రభా వాళ్ళ ఇంటికెళ్ళి కాళ్ళా వేళ్లా పడి ప్రభ తండ్రిని ఒప్పించగలిగే సరికి ఆ తండ్రి మరణం. ఎలాగోలా ప్రభని చదివించడానికి ఊరి వాళ్ళ సహాయం తీసుకుంటూ వెళుతున్నా అడుగడుగునా గండాలే.. ఇదీ కథ ..ఇంక చదువరులకి యాస అడ్డం రాదని భావిస్తున్నాను. 
http://magazine.maalika.org/

http://magazine.maalika.org/2015/06/09/%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF/

ముండా భిగడాజాయే

Thursday, May 28, 2015


మేము అద్దెకుంటున్న ఇంటి ఆవిడ తల్లి చిన్నప్పుడే భర్తని కోల్పోయి ఉన్న ఒక్క పిల్లకి కష్టపడి పెళ్ళి చేసిందిట. అల్లుడు కొన్నాళ్ళకి ఇటలీ వెళ్ళాడు. భార్యని తనతో తీసికెళుతూ అత్తగారిని కూడా రమ్మన్నాడుట. ఆవిడ నా ఊరొదిలి ససేమిరా రానందిట. అక్కడ 10 యేళ్ళుండి వాళ్ళు కెనడావచ్చారుట. లోపు పెద్దావిడ నలుగురు చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములు  పిల్లల ద్వారా కెనడాకొచ్చి ఉన్నారు. ఇటలీ కి పిలిచినా రాలేదు ఇప్పుడైనా రమ్మని కూతురు బతిమాలిందిట. అందరు అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఇక్కడుంటే అక్కడేంచేస్తావ్ అని అందరూ అనడంతో పల్లెటూరిని వదిలి కెనడాకొచ్చారు. ఇక్కడికి వచ్చాక పక్షవాతం వచ్చింది. అయినా కూతురికి వండి పెడుతూ పిల్లలని చూసుకుంటూ తోడు నీడగా ఉంటూ ఉంటారు. కూతురు అల్లుడు పనికి , పిల్లలు బడికి వెళ్ళగానే అక్కో , చెల్లో మరదలో ఎవరో ఒకరు ఫోన్ లు... అలా 3 వరకు మళ్ళీ పిల్లలు ఇంటికొస్తారు. వాళ్ళకి తిండి పెట్టి , సాయంత్రం వంటకి తయారు చేసేటప్పటికి చీకటైపోతుంది. చుట్టాలిళ్ళకి మాత్రం అందరూ కలిసే వెళతారు. ఏతా వాతా ఆవిడకి పంజీబీ తప్ప ఇంకే భాషా రాదు. మనకి పంజాబీ రాదు

సమ్మర్ లో సాయంత్రాలు ఇంటికి వచ్చేటప్పటికి ఆవిడ బయట కూర్చుని ఉంటారు. నన్ను అస్సలు కదలనీయరు. పక్కనే ఉన్న కుర్చీ చూపించి కూర్చో అంటారు. పెద్దవిడ కదా అని ఆగుతాను. ఆవిడ ఏంటో అడుగుతారు. నేను ఏంటొ చెప్తాను. చాఇ తాగారా అంటాను. అవును కాదు కాకుండా ఆవిడ పెద్ద పెద్ద గా నాలుగైదు నిముషాలు మాట్లాడతారు. అందులో రెండు సారులు చాఇ అని, ఒక సారి రోటీ అనీ ఇంకో రెండు సార్లు పిల్లలు అనీ వినిపిస్తాయి. పిల్లలు రొట్టెలు తిని చాఇ తాగారు. మా అమ్మాయి వచ్చాక వంట చేస్తాము అంటున్నారనుకుని ఆహా అంటా..ఆవిడ నన్నేదో అడుగుతారు.. ఏంటండీ అన్నట్టు మొహం పడతా.. మళ్ళీ అడుగుతారు. ఒక పదమేదో పట్టుకుని నాకు తోచిన సమాధానం అవును కాదు, లేదు, ఉంది లాంటి పదాలతో సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒక రోజు "గడ్డి కహా హై" అన్నారు. బాహర్ హై అన్నా. "నహీ "అన్నారావిడ. నేను బయటకొచ్చి గడ్డి చూపించి "గడ్డీ గడ్డీ" అన్నా.." నహీ నహీ" అంటారావిడ. ఇంకో రోజు పిన్నీ అంటారు. ఎవరి  పిన్ని ఈవిడేం అడుగుతుందో అనుకుంటా. ఇంకో రోజు రోజు క్రీం క్రీం  అంటారు..ఒక అరగంట/గంట ఎలా గడిచిపోతుందో తెలియదు. పెద్దావిడ పాపం ముఖాముఖి మాట్లాడ్డానికి ఎవరు లేకపోయేసరికి నా అవును కాదులకే బహుత్ ఖుష్.. "చంగే కుడీ" అని కూడా అంటారు. ఇది ఏంటో అర్థం కాదు. ఏమన్నా తాగమంటున్నారేమో అని "నహీ నహీ "అంటా, ఆవిడ నవ్వుతారు. వాళ్ళమ్మాయిని అడిగా "చంగే కుడీ అంటే ఏమైనా తాగడమా" అని..."కాదు మంచి అమ్మాయి" అని చెప్పింది. ఓహో నన్ను మంచి అమ్మాయి అని ఆవిడ అన్నప్పుడల్లా నేను కాదు కాదు అంటున్నానా ఇన్ని రోజులనించీ అని బాధ పడ్డా...తర్వాత్తర్వాత చంగే కుడీ అనగానే ఎగిరి గంతేసి మరీ హా హా అంటున్నా  లెండి. పనిలో పని గడ్డి అంటే బండి /కారు అనీ, పిన్ని అంటే డ్రై ఫ్రూట్స్ తో చేసిన లడ్డూ అనీ, క్రీం అంటే పక్క వీధిలో ఉండే కరీం అనీ ఙ్ఞానోదయమయింది.

ఒక రోజు ఆఫీస్ నించి వస్తూ గ్రాసాలు (grocery) కొన్నా. పిల్లలు ఆడుకోడానికెళ్ళారు. నేనే ఒకొక్కటిగా అన్ని సంచీలు మోసుకొస్తున్నా.. ఆవిడ కుర్చీ చూపించి కూర్చో అన్నారు. మళ్ళీ వస్తా అని సైగ చేసి..సంచీలన్నీ ఇంట్లో పెట్టి ఆఖరి ట్రిప్ లో ఆవిడ పక్కన కూచున్నా. "చదువు ఎప్పటికి అవుతుంది" అని అడిగారు. స్కూల్ ఖతం అనే పదాలు అర్థమయ్యి "అగ్లే సాల్" అని చెప్పా. "ఇంటి పని బయట పని ఒక్క దానివే చేస్తావు.. ముండే కుచ్ నహీ కర్తే"అన్నారు. "కర్తే కర్తే" అన్నా. ముండే అంటే అబ్బాయిలు అని తెలుసు కానీ ఎందుకో  నాకు నవ్వాగట్లేదు.. ఇంట్లో ఫోన్ మోగటంతో మళ్ళీ వస్తా అని ఇంట్లోకొచ్చేసా.. మా సీతయ్య నిద్ర లేవగానె స్నానానికెళుతూ "10 నిమిషాల్లో వస్తా అన్నం పెట్టెయ్, నా బట్టలు ఇస్తిరీ చేసావా, బాక్స్ సర్దేసావా, బ్యాగ్లో చార్జర్ పెట్టు, నేను చదువుతున్న పుస్తకం కూడా పెట్టమన్నా పెట్టావా" అంటూ ఊదరగొట్టేసారు. నేనూ ఆఫీస్ లో పని చేసి వచ్చాగా కొన్ని పనులైనా ఎవరైనా పంచుకుంటే బాగుణ్ణు అనుకుంటూ " పెట్టా పెట్టా" అన్నా నిదానంగా. భోజనం వడ్డిస్తూ "మీ నయిటు షిఫ్ట్ లు కాదు కానీ అన్ని పనులూ చేసి మీరు వెళ్ళాక చదువుకోవడానికి అస్సలు అవట్లే, అలసటతో కళ్ళు మూతలు పడుతున్నాయి. మీకు పగలు పని దొరికితే బాగుణ్ణు  రాత్రి రెండో సారి వండటం సర్దటం తప్పుతాయి. మా ముగ్గురితో పాటు మీకూ సర్దిస్తే సరిపోతుంది. సాయంత్రం ఇంటికొచ్చి ఉన్నవి తిని హాయిగా చదువుకోవచ్చు. పొద్దున్న కూడా పిల్లల పనులన్నీ ఒక్క దాన్నీ చేసుకోవాల్సి వస్తోంది. ఇందాక పెద్దావిడ కూడా అదే అన్నారు" అన్నా. ఏమన్నారు అనడిగారు. "ముండే కుచ్ నహీ కర్తే అన్నారు" అని  సరదాగా నోరు జారేసి నన్ను నేను తిట్టుకున్నా. ఇప్పుడు పనికెళ్ళేముందర కొపమొస్తే రాద్ధాంతమే ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడేసా ఏమవుతుందో దేవుడా అని భయపడుతూ పెరుగు వడ్డించా. " పిల్ల ముండలు కాస్త ఫర్వాలేదు కానీ మొగుడు ముండ అసలేం చెయ్యడని చెప్పకపోయావా" అన్నారు నిదానంగా. నేను ఉలిక్కి పడ్డా. జోకా సీరియస్సా అర్థం కాలే. లోపలినించి నవ్వు తన్నుకొచ్చింది కానీ ఆయన నవ్వట్లేదు సీరియస్ గానే అన్నారు. హమ్మయ్య ఇంతటితో సరిపోయిందని నేను స్టవ్ తుడవడానికన్నట్టు అటు తిరిగి పని చేసుకున్నా.


మర్నాడు శనివారం కొందరు స్నేహితులొచ్చారు. రాత్రి నించీ ఎవరితోనన్నా చెప్తే బాగుండుననే నా ఉత్సుకతని ఆపుకోలేక వాళ్ళకి "ముండా కుచ్ నహీ కర్తే "కహానీ చెప్తుండగా ఫోనొచ్చింది. స్నేహితులందరూ "నా మొగుడు ముండ మంచోడు, నా పిల్ల ముండ అల్లరోడు" అంటూ "మొగుడు ముండ,పిల్ల ముండలు" అని రిపీట్ చేసి పడీ పడీ నవ్వుతున్నారు. మా సీతయ్య కూడా చిరునవ్వులు చిందించారు. అబ్బో సార్ కి కూడా జోక్ అర్థమయినట్టుందే  అనుకుంటూ ఫోన్ తీసా. జయంతి ఫోనుకోయంబత్తూరు వాళ్ళు

ఈవిడ పరిచయమైన కొత్తల్లో ఫోన్ చేసినప్పుడల్లా మొదటి వాక్యం " చిన్నా అవుడ అబ్బ లేడా" అని అడిగేది. చిన్నా వాళ్ళ నాన్న ఇంట్లో లేరా అనిట. కొత్తల్లో తెగ నవ్వొచ్చేది. మీ నాన్న లేరా అని అడగాలంటే నీ అబ్బ లేడా అంటుందేమొ అనిబాగా క్లోస్ అయ్యాక "చిన్నా అవుడ అబ్బ" అనడం మానేసి  "అన్న లేడా" అంటోంది హమ్మయ్య అనుకున్నా. "చపాతీలు చేస్తున్నా రెండు చేతులూ బిజీ.. నిన్ను స్పీకర్ లో పెట్టానబ్బా" అన్నా. బ్యాక్ గ్రవుండులో మాటలు వినిపించి ఆవిడ " ఏమిది నన్ను పిలవలేదు మీ అన్నను కొనుక్కొచ్చేనా" అంది. "అల్రెడీ మా అన్నని కొన్నావు మళ్ళీ కొనకు, తీసుకుని వస్తానంటే రా ఫర్వాలేదు"  అన్నా. "ఎప్పుడు కొనింది?" అనడిగింది. "పెళ్లప్పుడు కొన్నావుగా" అన్నా.  " తీసానంటున్నావా" అని నవ్వింది. తనతో ఒక  తికమక ఉందిలెండి. మనం ఏదైనా కొనుక్కొస్తా అంటే తను " సరే" అంటుంది ,ఏమైనా తీసుకొస్తా అంటే "వద్దు వద్దు యేల దుడ్డు వేస్ట్ సేసేవు" అంటుంది. ఇది చాలా సార్లు అయ్యాక నాకు అర్థమయ్యిందేంటయ్యా అంటే వాళ్ళకి తీయడం/తీసుకురావడమంటే కొనడంట. కొనుక్కురావడమంటే కొనితేవడం లాగా తీసుకురావడంట. నాకు చెప్పడం రాక మిమ్మల్ని తికమక పెట్టానా.. పోనీ లెండి సారి మీరు మా ఇంటికొచ్చేప్పుడు ఏమీ తీసుకురాకండి కానీ ఎవరినైనా కొనుక్కురండి.  ఇంతకీ మా జయంతి ఫోన్ చేసిన విషయం చెప్పలేదు కదూ. మా సీతయ్య ఇండియా వెళుతున్నారని గుర్తొచ్చి ఏదొ వస్తువు పంపుదామని అనుకుందిట. కానీ ఈయన ఎప్పుడు వెళ్ళేదీ గుర్తు లేదుట. అందుకని "ఇంతకీ మా అన్న ఉండా పోయి పూడిసిండా" అంది. వెనక నించి మా సీతయ్య " పోయాడు కానీ ఇంకా పూడవలేదని చెప్పు" అన్నారు. అటు జయంతి అర్థం అయ్యీ అవనట్టు నవ్వితే ఇటు ఇంట్లో ఉన్న మిగిలిన స్నేహితులందరూ గట్టిగా నవ్వేసారుఎప్పుడూ సీరియస్ గా ఉండే మా సీతయ్య ఇలా అనడం విన్న మా స్నేహితురాలు మా సీతయ్యనుద్దేశించి " ముండా భిగడాజాయే" అంది. " ముండా" అని మా సీతయ్య ఆశ్చర్యం వ్యక్తం చేసి మా అందర్నీ మరొక్క సారి ఆశ్చర్యంలో ముంచేసారు!