అమ్మకు తొందరెక్కువని చుట్టాలందరూ ఆడి పోసుకుంటారు. పిల్లలకి పేర్లు
పెట్టడంలో అమ్మ అస్సలు శ్రధ్ధ తీసుకోదని అందరూ చెవులు కొరుక్కుంటుంటారు.
వాళ్ళ దృష్టిలో మా శాంతక్కకి
'అశాంతి' ఎక్కువ.....ప్రకాశన్నయ్య ఎప్పుడు
'డల్' గా ఉంటాడు... 'ధరణి అక్కకి 'అసహనం'...విద్యాధర్ అన్నయ్యకి పదుఎనిమిది ఏళ్ళకే
ఐ.ఏ.ఎఫ్. ఐ .ఏ. ఎస్ అక్షరాలన్నీ పేరు పక్కకొచ్చి
చేరాయి. మీకు మా అమ్మకు మల్లేనే కుంచెం తొందరెక్కువ అనుకుంటా. నేను చెప్పకుండానే ఈ
డిగ్రీ ఏంటని కనిపెట్టేద్దామనే !!!అబ్బ అంత ఈసీ కాదండీ!!”ఇంటర్ అప్పియర్డ్ బట్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్” .....అదీ సంగతి! ఇంక శ్యామలక్క 'బంగారం 'లాగ పచ్చగా ఉంటుంది. నేనే
గనక పెద్దక్క ప్లేస్ లో ఉంది ఉంటే,, ఈ పాటికి
చిట్టి తమ్ముళ్ళు చిట్టి చెల్లెళ్ళ పేర్ల గురించి అమ్మకి బోల్డు సలహాలిచ్చేదాన్ని,
కానీ చెప్పా కదా దానికి అశాంతి అని... అది
పెట్టే గోలకి మనశ్శాంతి ఉండదని చెపుతూనే అమ్మ కొంచమైనా ఆగకుండా మిగిలిన వాళ్ళందరికీ తనకి
తోచినపేర్లన్నీ పెట్టేసింది....తోచినవంటే తోచినవి అని కాదనుకోండీ, అమ్మమ్మనీ, నానమ్మనీ,
అత్తనీ, బాబాయ్ నీ , రెండు వయిపుల తాతయ్యలనీ సాటిస్ఫై చేసేసిందన్నమాట ఆ పేర్లన్నిటితో.
చివరాఖరుగా తనకి చాలా ఇష్టమయిన పేరు అట్టే ఉంచుకుని ఇలా వెన్నెల లాగా కనిపించిన నాకు
అచ్చ తెనుగు సోయగాలద్ది పెట్టేసి, ఎంతో మురిసిపోయింది.
ఇలా అమ్మ దిల్ ఖుష్ నగర్ లో సెటిల్ అవుతున్న సమయంలో సడెన్
గా నాకు పెద్ద జ్వరం తగిలి దిల్ షుక్/షొక్/షేక్/శోక్ నగర్ లోకి తోసేసింది అమ్మని. జ్వరం ప్రభావమో, లేక నా ఒరిజినల్ కలరో తెలీదు
కానీ అమ్మ మాత్రం ఇరుగు దిష్టి పొరుగు దిష్టి వల్ల నా రంగు మారిపోయిందని తెగ బాధ పడిపోయేది.
రాగా రాగా 'ఎన్నెల-నల్లగా ఉంటుందీ 'అని ట్యాగ్ లైన్ నా పేరుతో సెటిల్ అయిపోయింది. “ఏమే కళా, పై పిల్లలప్పుడంటే నీకు చిన్నతనం
తెలియదనుకో, తరవాతయినా శ్యామలకి దీని పేరు, దీనికి శ్యామల పేరు పెట్టక పోయావా? బంగారం
రంగు పిల్లకి శ్యామలనీ దీనికి ఎన్నెలనీ ! ఒక్కళ్ళకయినా తగ్గ పేరు పెట్టలేదు..గుణాలంటే
పెద్దయ్యేవరకూ తెలియవు కానీ రంగు పుట్టగానే తెలుస్తుందిగా....” అంటూ చుట్టాలందరూ పువ్వు
పుట్టగానే పరిమళిస్తుంది టైపులో క్లాసులు పీకేవారు. ' పుట్టగానే వెన్న లాగే ఉంది వదినా
' అని అమ్మ సంజాయిషీ ఇస్తూ ఉండేది . శ్యామలక్క పేరు గతం గతహా కాబట్టిన్నీ, నా పేరు
ఇంకా గతం లోకి వెళ్ళలేదు కాబట్టిన్నీ నాకు ఎలాగయిన అమ్మనొప్పించి 'బొగ్గో' 'కొరివో'
అని పేరు పెట్టించేసి నన్ను 'సార్థక నామధేయురాల్ని ' చేయ్యడానికి కృషి చేసిన ఘనత వహిద్దామని
ఆరాట పడుతున్న బంధుగణాన్ని తోసి రాజని అమ్మ నా పేరుని అచ్చంగా నాకే వదిలెయ్యడం కాకుండా,
నన్ను 'సార్ధక నామధేయురాలను’ చేయు పనికి తన దోవలో తాను కంకణం కట్టుకుంది...
పసుపు, చందనం , పాలూ పళ్ళూ మాత్రమే కాకుండా ఇసుక ఇటుకా కచికా
గరికా ఏవి దొరికితే వాటితో నన్ను తోమెయ్యడం మొదలు పెట్టింది.
అమ్మ బాధ అమ్మది. అబ్బ పేరుకి తగ్గట్టు ఎన్నెల్లా ఎంత తెల్లగా ఉందో అనిపించెయ్యాలని
అమ్మ తాపత్రయం. అలా తోమీ తోమీ, అలసి నన్ను మా (అ)శాంతక్క చేతిలో పెట్టేసేది.
మా అక్కేమో నా చుట్టూ పౌడరు మేఘాల్ని సృష్టించేసి, కొంచెం పవుడర్ని ముక్కుల్లోకీ నోట్లోకీ
కూడా పోసేసి, నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి తన శాంతి కపోతాన్ని ఎగురవేసేది...
పక్కింటిలో కొలువయి ఉన్న గురువు గారి సలహా మేరకు నాన్న తెచ్చిన
విభూదిని క్రమం తప్పకుండా ఎవరో ఒకరు వంద గ్రాములు కొబ్బరి నూనెలో కలిపి పయి పూతగానున్నూ,
వంద గ్రాములు పాలల్లో కలిపి లొపలికిన్నీ డోసు ప్రకారము పగలు పది మార్లున్నూ, రాత్రి
(నా దురదృస్టం బాగుండీ గుర్తుంటే )రెండు మార్లున్ను వేసెడివారు. అమ్మ దిల్ మళ్ళీ 'ఖుష్
నగర్ వయిపు దారి తీసింది. ఆ విభూతి పూత చూసుకుని అమ్మ గొప్ప నమ్మకంతో ఉండేది.
యీ లోపు కలర్ మ్యాచ్ అయ్యిందని ఒక మాటు బాల కృష్ణుడి వేషం, ఒక
మాటు చిన్ని కృష్ణుడి వేషం వేసేసి ఫుటోలు తీయించేసి 'అచ్చం కృష్ణుడిలా ఉంది కదూ' అని
అమ్మ మురిసి పోయింది కూడా. స్కూలుకి వెళ్ళడం మొదలు పెట్టాక డాన్సుల్లొ రాక్షసుల వేషాలకీ,
చిన్న చిన్న నాటకాల్లో కాకి , కోకిల వంటి వేషాలకీ బయట నుంచి సహజ నటుల్ని అద్దెకి తెప్పిచ్చే
కష్టం , నష్టం మాస్టార్లకి తప్పించే భాగ్యం నాకు దక్కింది. అలా అలా చిన్న చిన్న వేషాల్లోంచి
"నీళా" సూక్తం లో నీలా దేవి వేషంలో 'నీల మోహన రారా, నిన్ను పిలిచే నెమలి
నెరజణా’ అనే పాత్ర వరకూ ఎదిగి పొయా.
పదహారేళ్ళ వయసులో గాడిదయినా అందంగా ఉంటుందని ఒక ఆంగ్ల కొటేషన్
చదివేసిన కాంఫిడెన్సుతో అలరారుతూ అలరారుతూ ఉన్న తరుణంలో ,నా పుట్టిన రోజున అమ్మ పట్టు
పరికిణీ ఓణీ కొంది. అది వేసుకుని మా ఊరి నించి వచ్చిన పిన్ని దగ్గరికెళ్ళి 'పిన్నీ
నేను అందంగా ఉన్నానా?' అని అడిగాను. పోనీ పుట్టిన
రోజు పాపాయి కదా అని వదిలెయ్యొచ్చుగా..కొంచెం మొహమాటం తక్కువయిన పిన్ని (అమ్మ అంటుండేది
పిన్నికి మొహమాటం తక్కువని), “
అందగత్తెవూ కాదు, అనాకారివీ కాదు... సంసార పక్షం , అంత రంగు కూడా కాదు కదా !” అంటూ
మహేష్ బాబు త్రిషని కామెంటినట్టు కామెంటేసింది.
అది విన్న బాబాయ్ గతుక్కుమని 'అమ్మలూ నీకు యీ డ్రస్సు అద్దిరిందిరా" అని
నన్ను కంఫ్యూసు చేసి కొండెక్కించేసాడు. ఆ నాడు
బాబాయే గనక అడ్డు పడక పొయ్యుంటే యీ లోకం ఎన్నెల్లో అమావాస్యను కాకుండా ఒక పవుర్ణమిని చూసి ఉండేది.
ఏంటో! మీరు బాగా తికమక పడ్డారు కదా? నేను కూడా
అంతే! అదే చెబ్దామని.
తెలిసీ తెలియని తనంలో అమ్మ ప్రొత్సాహంతో ఇసకల్లో ఆడుకుంటున్నప్పుడు అక్కడక్కడ ఫ్రీగా దొరికే బంక మట్టిని
ఒక చెంచాడు నీళ్ళల్లో నానబెట్టి, మొహానికి పులుముకుని, పసి పిల్లలని, బోసి నవ్వుల పెద్దల్నీ
కూడా భయపెట్టేసిన రోజులు కొన్నయితే, అదే మట్టిని ముల్తానీ మిట్టీ అనిన్నీ, దాంట్లో
పన్నీరనిన్నీ, పాకమనిన్నీ, మసి పూసి మారేడు కాయ చేసి సగం జీతానికి చిల్లు పెట్టి నాన్నని భయ పెట్టే బ్యూటీ
పార్లర్ రోజులు కొన్నీ.
పాలు పెరుగు వాటి నుండి వచ్చు వాసన అంటే భయంకరమయిన అసహ్యమున్న
నాకు... తెల్లనివి తింటే తెల్లగా అవుతావని బ్లాకు మెయిలు చేసి నాతో కళ్ళు, ముక్కు , చెవులు, చివరికి నోరు కూడ మూయించి అవన్నిటినీ తినిపించిన ధరణి అక్క మీద ప్రతీకారం
ఎలాగయిన యీ జన్మలోనే తీర్చుకుంటా. అందుకే ప్రతి రోజూ తప్పనిసరిగా
గుడికి వెళ్ళి దానికి నాలాంటి నలుగురు బ్లాక్
బ్యూటీలనిమ్మని సవినయంగా ఎ దేవుణ్ణి కోరుకోవడం నా దిన చర్యలో భాగంగా ఉండేది.
అనగా అనగా డ్రమ్ముల్లో పాండ్స్ స్నోలూ, డ్రీంఫ్లవర్ పవుడర్లు,
ఫెయిర్ అండ్ లవ్లీలు, బ్లీచింగులు, ఫేస్ మాస్కులు పాపం నాన్న ఆస్తిని 'ముల్లు పొయ్యి
కత్తొచ్చె డాం డాం డాం' చేసేసాయ్. కట్నం కోసం దాచిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే కట్నం
అక్కరలేదనే అల్లుడు వచ్చేస్తాడనే ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసేసి...నెట్ ప్రెసెంట్ వాల్యూ
పోసిటివ్ అని లెక్కలేసీ , ఎలాంటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్ కయినా సిద్దపడిపోయేది అమ్మ
. అమ్మ ప్రార్థనలు విన్న దేవుడు, అమ్మ మంచి
ఫయినాన్షియల్ అనలిస్టని సర్టిఫై చేసేసి అమ్మని గెలిపించేసాడు...
అయితే అత్తగారు మాత్రం 'ఒరే అబ్బాయీ, కోడలు నలుపయితే కులం నలుపవుతుందిరా
, అది ఇంకొంచెం తెల్లబడే మార్గం చూడమని చెపుతూనే, ఆవిడ శాయశక్తులా కచోరాలు, ఛాయ పసుపు, తేనె, గంధం
పొడి, అశ్విని వారి సున్ని పిండి, శెనగ పిండీ పెద్ద పెద్ద డబ్బాలలో నింపి ఉంచడమే కాక,
అప్పుడప్పుడే మార్కెట్లోకొస్తున్న 'త్రీ సులసీ' సారీ....'అప్పు తచ్చయ్యింది... “శ్రీ
తులసి” అను లేపనమును, రీజనల్ సేల్సు మానేజరు గారితో మాట్లాడి మూడు సంవత్సరముల వరకు
ఆ కంపెనీ తయ్యారు చేయు ప్రొడక్షను అంతయూ ఎవరికీ అమ్మరాదనిన్నీ,
ఆ ప్రొడక్షను మొత్తమూ సరాసరి మా ఇంటికి రావలెననియున్నూ, కాంట్రాక్టు పైన సంతకము
పెట్టించుకొనిరి. అదియును గాక టీవీలో ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైసుమెంటు వచ్చినప్పుడల్లా
' వీళ్ళ మొహం మండిరి....నా కోడలు ఇరవయి సంవత్సరాలు వాడింది... కూసింత మార్పు లేదు...
కంపెనీ మూసుకుని అవతలకి పొండి.....ఏదో నేను పూనుకో బట్టి సరిపోయింది గానీ, లేక పోతే
యీ వెర్రి మొహం మిమ్మల్ని నమ్ముకుని కాలం గడిపేసేది...’అంటూ నానా విధములయిన శాపనార్ధములు పెట్టేస్తూ
ఉండేవారు.
ఆవిడ చేసిన మూడు సంవత్సరముల కాంట్రాక్టు పుణ్యమాని , నేను నలుపు
అనబడు బ్రాండు నుండి.. చామన ఛాయ యను ప్రమోషను పొందితినని మా అత్తయ్య ప్రగాఢ విస్వాసము.
అంతియును గాక...”నలుపో తెలుపో నలుగురు బిడ్డలు, ముదురో ముతకో మూడు గుడ్డలు” అని చెపుతూ,
మా వారితో వందల కొలది గుడ్డలునూ, నాతో ఇద్దరు బిడ్డలనూ రెస్పెక్టివ్ లీ కొనిపించి
, కనిపించేసారు. ఆ గుడ్డల రంగుల నాణ్యత వాటి బ్రాండు పైనా,
ఈ బిడ్డల రంగు నేను వాడిన త్రీ సులసి పైనా
ఆధారపడి ఉందని ఆవిడ డి సైడు అయిపొయ్యారు కాబట్టి మనం కాదనలేము.
అత్తయ్య ఫిలాసఫీ అలా సాగుతుండగా మాకు అనుకోకుండా కెనడా రావడానికి పర్మనెంటు రెసిడెన్సు కార్డు వచ్చింది.
ఇది మంచు ప్రదేశము కాబట్టి మంచి రంగు వచ్చేస్తుందనీ, మంచు దేశాల్లో ఉన్నవాళ్ళంతా ఎక్కడ
పుట్టినా సరే, ఇక్కడకొచ్చి దొర బాబుల్లా తెల్లహా అవుతారనీ , మనవలు దొర బాబుల్లా ఉండడానికోసం
వాళ్ళని విడిచి ఉండడానికయినా ఆవిడ సిద్ధమేనని...కన్నీళ్ళతో పంపించారు.
ఇక్కడకొచ్చాక మొట్టమొదట ఎయిర్‌పోర్టులో ఒక నల్ల జాతీయుడ్ని చూసి నా నోరు అమాంతం వైడు ఓపెన్....
సమయానికి యశోద సీన్లో లేదు కానీ ఉండుంటే ఉత్తర అమెరికా ఖండే, కెనడా దేశే, టొరంటొ నగరే,
ఎయిర్‌పోర్టు స్థలే, ఎన్నెల నామధేయస్య, 'మవుతు
ఓపెనస్య' తో సహా అన్నీ వీక్షించి ఉండేది..”ఏంటీ
ఇక్కడ నల్లగా నా లాంటి వాళ్ళు కూడా ఉంటారా” అని అడిగాను ఆశ్చర్య పోతూనే. ”అబ్బే లేదే, నువ్వు ఒక్కదానివీ ఆకాశం లోంచి ఊడి
పడ్డావు కదా అందుకని ఎవరూ నీలాగా ఉండరు, పద
పద” అని అన్న మా వారి నడకకి నా రన్నింగ్ తో ఈక్వేషన్ వేసాను. ఇంకా తెరుచుకున్న నా నోరు
ఇంతింతై వటుడింతై లాగా చిన్నప్పటి తిరుపతి లడ్డూ పట్టే సయిజుకి చేరుకున్నా, ఇంకా నన్ను
నల్ల జాతీయులు హాస్చర్య పరుస్తూనే ఉన్నారు.
లయిఫ్ అనగా జీవితమని చిన్నప్పుడు ఇంగ్లీషు మాస్టరు చెప్పడం వల్ల
తెలియుట చేతనూ... హుడ్ అనగా తలపయి వేసుకొను ముసుగని ఇక్కడ పరిచయమయిన వారు చెప్పడం వల్లనూ
తెలుసుకొనిన దాననయి, యీ జీవిత ముసుగును ప్రారంభించితిని (లయివ్ లీ హుడ్ అని టిప్పణి).
ఇక్కడకు రాగానే అందరూ “సిన్ కార్డ్” వచ్చిందా అని అడిగేవారు....ఇదేమి పాపము రా బాబూ... అని మధన పడ్డాక... సోషల్ ఇన్శ్యురెన్స్
కార్డ్ ను సిన్ అందురని పాపముపశమించుకొంటిమి. ఆ దిక్కుమాలిన కార్డ్ ఏదో రాగానే, కొండెక్కినంత సంబరపడిపోయి ఉద్యోగముల వేట ఆరంభించితిమి.
రాజు గారి చేపల వేటలో లాగ.... ఏదో ఒక
చేప దొరికిందని సంబరపడి ఒక రోజు పనికి వెళ్ళేవాళ్ళం. రెండవ రోజు....'ఇయ్యాల పని లేదు
ఉన్నప్పుడు పిలుస్తపో' అనే పెద్ద మేస్తిరి గడపట్లోంచే “ఇంటికి వొయ్యి రెస్టు తీస్కో”
అని చెప్పేసేవాడు. మన గ్రూపులో జనాలేమో అందరు చదువు బాబులే! “నేను ఇంజనీరు, నేను డాక్టరు
,నేను పీ హెచ్ డీ, నేను ఎం ఫిల్”.......ఇలా వెనకింటి (బ్యాక్ హోం) కతలు చెప్పుకొని నొచ్చుకోవడమే తప్ప ఏంచెయ్యాలో
ఎవరికీ తెలియదు. “మీ చదువులు తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఉన్న గోదారిలోనో, గంగలోనో, నర్మదలోనో
అంతగా టికెట్ ఎందుకు వేస్టు అనుకుంటే అన్ని జలపాతముల కెల్ల గొప్ప జలపాతము నయాగరా జలపాతములోనో
కలిపెయ్యండీ....అవేవీ ఇక్కడ నాలిగ్గీసుకోడానిక్కూడా పనికి రావు...మేము ఇస్పెషల్ టంగ్
క్లీనర్లు తయారు చేసినం” అని అందరూ చెప్పడంతో, నిశ్చేష్ట నైన నేను, ముప్పది అయిదు సంవత్సరములు కాపాడుకున్న నా నలుపంతా
విరిగి పోయి, పాలిపోయి పాండు వర్ణము సంతరించుకొంటిని....
ఇంక వెంటనే ఇంటికి ఫోను చేసి... “అత్తయ్యా....రంగు పడిందీ” అని
చెప్పేసాను. అత్తయ్య బోల్డు సంబరపడిపోయారు. “నేను చెప్పాను కదే 'కెనడా అంతే కెనడా అంతే
అని!”
ఏతా వాతా తెలుసుకున్నదేమనగా “ఆఫీసు ఉద్యోగములన్నీ తెల్లవారిని
వరించును. నల్లవారు ఎక్కువ బరువులు మోయగలుగు శ్రమ జీవులగుట వల్లను, హక్కుల కోసము పోరాటము
సలిపి మా పెద్దక్కకు వలే ప్రపంచకంలో అశాంతి సృస్టించుదురేమోనన్న భయం వల్లను ఫ్యాక్టరీ
ఉద్యోగములన్నియును ఇవ్వబడును.... ఇంక మిగిలిందెవ్వరయా అంటే
అటునిటు కాని బతుకును
పటుదయిన వెర్రినవ్వును, మొగమాటమునన్
అటు దిరిగి పోని వాడును ఇటు ఉంటకు జెడిన వాడు
బ్రవునుర......సుమతీ...
అని సుమతీ
శతకాన్ని మార్చి చదువుకున్నా కూడా లాభం పెద్దగా కనబడలేదు.
అయ్యో ఎంత పని జరిగింది! నా ఒరిగినల్ రంగు నాకుంటే చిన్నదో పెద్దదో
ఉద్యోగం సంపాదించేదాన్నే!
ఛఛ, ఎంత తప్పు చేయించేసారు నాతో అమ్మ, అత్తయ్య కలిసి....నా సొంత
రంగుని......ఏంటీ? నాదంటే నాదయిన సొంత రంగుని...పవుడరు డబ్బాల కంపేనీకీ, పాత సామన్లాడికీ
కిలోల్లెక్కన అమ్మేసీ నాకెంత అపకారం చేసేసారు?..ఛ,
నాకయినా బుద్దుండక్కర్లే...అక్క దగ్గరి నుంచీ అత్తయ్య వరకూ అందరూ నా కలర్ తోటి ఆడుకుంటుంటే.....నా
బుజ్జి కలర్‌ని ఇన్నాళ్ళుగా వాళ్ళందరి చేతుల్లో పెట్టేసానా? వీల్లేదు గాక వీల్లేదు.....
చిన్న ఉద్యోగమైనా సంపాదించాలంటే, నా కలర్ నాక్కావాలంతే .....అందుకే నాకు అపకారం చేసిన
వాళ్ళందరితో మాట్లాడ్డం మానేసి... నా రంగు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నా....ఏంటీ? రంగు
పడుద్దంటారా?
(కెనడాకొచ్చిన కొత్తల్లో సరదాగా వ్రాసుకున్న కథ)
34 వ్యాఖ్యలు:
wow..
mottaniki andam telupulone undi ani mi vallu pettina illusuions nundi bayatiki vacharanna maata.
:)
జాబిలి గారు, కృతజ్ఞతలు.
నా కలర్ చూస్తే మీరు కూడా మా వాళ్ళలాగే డిసయిడు అవుతారు. మరీ ముట్టుకుంటే అంటుకునే కలర్ అండీ నాదీ...
హ్మ్! ఎందుకండీ రంగుకోసం అంత తాపత్రయపడ్దం?? హాయిగా ఏ రంగులో పుడితే...అదే మహాప్రసాదం అనుకోవడమే!నల్లనయ్య నలుపైన ఎంత ముద్దొస్తాడు? కానీ నాది విచిత్రమైన కేసు.....నేను పుట్టినప్పుడు పింక్ రంగులో ముద్దుగా గులాబీ పువ్వులా ఉండేదాన్నీ...రాను..రాను... ఎరుపుకి..అటునించి తెలుపుకి మారా! కాలెజికి వచ్చెసరికి ఎండల్లో తిరిగీ తిరిగీ ఈ అమ్మాయి మంచి కలరండీ అని ఎవరు చెప్పినా నమ్మలేని స్టేజ్‌కి వచ్చా!అస్సలు పట్టించుకునే దాన్ని కాదు....ఏ కలర్ ఐతె ఏంటీ అనుకునేదాన్ని..అమ్మ మాత్రం కొంచెం బాధ పడేదీ..ఎలా ఉండే పిల్ల..ఎలా అయిపోతోందీ అని.మీరు నమ్మరు..నేను నా జీవితంలో చెయించుకున్న మొదటి-చివరి ఫేషియల్ పెళ్ళి అప్పుడు..అదీ అందరి బలవంతం మీద :)) కానీ ఇప్పుడు మళ్ళి నా చిన్నాప్పటి రంగు మెల్లగా వస్తోందీ...ఇంట్లోనే ఉంటున్నా కదా! ఎండ తగిలితే మాడిపొయె బాచ్ అన్నమాట నేను :) సూర్యుడికి మనకు అస్సలు పడదులేండీ.. :))
ఇందు గారూ,కృతజ్ఞతలు
ఎంటీ అంత సీరియస్ గా తీస్కున్నారా,
మీరు తెగ నవ్వేసారనుకున్నాను.
యేదో సరదాగా...
మీ "రంగు పడుద్ది" చదివాను. మీలో హాస్యప్రవృత్తి ఉంది. సౌజన్యం ఉంది. వీటిని మించిన మంచి రంగులేమున్నాయి లోకంలో? చాలా బాగా రాసారు మీ అనుభవాలను. సంతోషం!
మీ "అటునిటు కాని బతుకును" పద్యంలోని తప్పులను సవరిస్తే ఈ రూపానికి వచ్చింది.
అటునిటు కానట్టి బ్రతుకు
పటువగు నొక వెఱ్ఱినవ్వు పలు మోమోటల్
అటు దిరిగి పోని వాఁడును
ఇటులుండఁగఁ జెడిన బ్రవును హితముగ సుమతీ!
ఇక "శంకరాభరణం"లో సమస్యాపూరణకు మీరు పంపిన భావాలకు నా పద్య రూపాలు .....
1)
అత్త పండు ముత్తైదువయై విలసిల
మామ వెండి చంద్రుని వెల్గుతో మెలఁగఁగ
నిండు దంపతులఁ గనుల పండుగ వలె
వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె.
2)
ధనికురాలైన నొక వృద్ధ వనితఁ గాంచి
యామె సంపద పొందెడి యాశతోడ
చేరె డింగరి తన కోర్కె దీరు ననుచు
వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె.
హ హ హ సూపరుంది :-))ఇప్పుడిక మిగతా పొస్ట్లు చదవాలి
" పదహారేళ్ళ వయసులో గాడిదయినా అందంగా ఉంటుందని " ఈ సామెత్ ఎప్పుడూ వినలేదు. అయితే వినడానికి బావుంది....
"సమయానికి యశోద సీన్లో లేదు కానీ ఉండుంటే ఉత్తర అమెరికా ఖండే, కెనడా దేశే, టొరంటొ నగరే, ఎయిర్‌పోర్టు స్థలే, మమ ఎన్నెల నామధేయస్య, 'మవుతు ఓపెనస్య' తో సహా అన్నీ వీక్షించి ఉండేది.." ఇదయితే సూపర్ :-)))
కొంచెం లెంత్ తగ్గించాలండి -) కెనడా పార్ట్ రెండొ భాగం గా రాస్తే ఇంకా బావుండేది :-)
లేదండీ...కలర్ డిస్క్రిమినెషన్ అంటే నాక్కొంచెం చిరాకు.అదంతా గుర్తొచ్చింది...అందుకే అలా కామెంటేసా! కానీ మీరు వ్రాసింది మాత్రం సూపర్.టపా బాగుంది...ముఖ్యంగా మీ అత్తయ్యగారు మిమ్మల్ని తోమిన సన్నివేసాలు :ఫ్ ఇంకా మీ 'త్రీ సులసీ కూడా....మీరు బాగా వ్రాస్తున్నారు కాని ఎన్నెల గారు...నాదొక్క విన్నపం.టపా మరీ నిడివి ఎక్కువైపోతోంది...కొంచెం...కొంచమంటే..కొంచమే తగ్గించి వ్రాయండే! ఏం అనుకోకండీ ఇలా చెప్పాననీ...మా మంచి ఎన్నెల గారు కదా!
అన్నం తింటూ అనుకోకుండా మీ కధ చదువుతూ కామెంట్ పెట్టకపోతే మహా పాపం తగులుతుంది అని అదే చెత్తో కామెంట్ టైపేసా..అంత బాగుంది మరి మీ పోస్ట్..కాస్త పేరాగ్రాఫ్స్ విడకొట్టరూ ప్లీజ్ :)
బావుందండీ. చాలా బాగా రాసారు. "పదహారేళ్ళ వయసులో..." సామెత అమ్మ చెప్పేది. "వయసు వస్తే వంకర కాళ్ళు కూడా తిన్నగా కనబడతాయిట..." అని ఇంకో సామెత కూడా చెప్పేది.
టపా పెద్దదయినా పర్లేదు కానీ పేరాల్లోకి విభజిస్తూ ఉండండి. గేప్స్ ఉంటే చదవటానికి బాగుంటుంది. మొదట్లో నాకు మరొకరు ఇచ్చిన సలహానే ఇది...:)
నాకధ మీకెల్లా తెలిసింది. ఏడుగురు తర్వాత ఎనిమిదో వాడు ఇంకెల్లా వుంటాడు అని అమ్మా నాన్నా సమాధానపడిపోయారు కాబట్టి నన్నెవరూ తోమలేదు. అదేమిటో అక్కయ్యలు కానీ అన్నలు కానీ పక్కన ఎప్పుడు నడవనియ్యలేదు. నా తర్వాత పుట్టిన చెల్లెలిని ఎత్తుకుందామనుకుంటే అది నల్లబడిపోతుందనేవారు. పాపం అదేదో సినిమాలో లాగా, మా ఆవిడకి కత్తితో పెళ్లి చేసి ఆ కత్తి నేనే అన్నారు. పాతచర్మం తీసేస్తే కొత్త చర్మం బాగుంటుందేమో నని ఆవిడ ఆ కత్తితో నా చర్మం గీకిగీకి ఇల్లా తయారుచేసిందన్నమాట.
మీ కధ కన్నా పెద్దది గా ఉందా నా కామెంటు.నిజంగా నేను వ్రాద్దామనుకున్నది మీరు వ్రాసేశారు. వదల బొమ్మాళీ వదల అంటూ నేను కూడా ఇంకోటి వ్రాసేస్తాను, కొంత కాలం పోయింతర్వాత.
చాలా బాగా వ్రాసారు. మొదటినించి చివరిదాకా ఒకే టెంపో మైంటైను చేశారు.
మరే పూర్తిగా చదివేసరికి నిజంగానే రంగుపడిందండి :-D టపా బాగుంది అక్కడక్కడా చెణుకులు మరీ బాగున్నాయ్.
కంది శంకరయ్య గారికి,
నమస్సుమాంజలి. మీరు నా బ్లాగ్ సందర్శించినందుకు కృతజ్ఞతలు. మీరు 'అటు నిటు కానీ పద్యం దిద్దినందుకు నాకు చాల ఆనందంగా ఉంది.
పూరణ పద్యాలు ఎంతో అందం సంతరించుకున్నయి. నా అల్లరి చిల్లరి భావాలకు మీరు ఎంతో అందమయిన పద్య రూపమిచ్చారు. మీ బ్లాగు అత్యద్భుతము. నాకు కవినై పోవాలనిపిస్తోంది మీ బ్లాగు చూస్తుంటే.
మంచు గారూ, కృతజ్ఞతలండీ. తప్పకుండా జాగ్రత్త తీసుకుంటాను తదుపరి పోస్టుల్లొ.నాకు కూడ వ్రాసేటప్పుదు తెలియ లేదు గానీ, మీరు చెప్పాక మళ్ళీ చదివితే "యశొద లేదు గానీ" చాలా నచ్చింది..మా ఇంట్లో కూడా.
ఇందు గారు, కృతజ్ఞతలండీ, గురువర్యులు చెపితే వినకుండా ఎలా? నిజ్జంగానే శ్రీ తులసి అని వచ్చిందండీ, మా టాంబొయ్ దానికి అలా త్రీ సులసి అని పేరు పెట్టింది....తనకి థ్యాంక్స్ పాస్ చేసేస్తాను...
నేస్తం గారు, కృతజ్ఞతలు. మీ కామెంటు మంచి సువాసన వస్తుంటే ఏంటొ అనుకున్నాను...మీరు కొత్త ఆవకాయన్నం అన్నం తింటున్న చేత్తొ టైపేసారన్న మాట
తృస్ణ గారూ, కృతజ్ఞతలండీ,
'టపా పెద్దదయినా పర్లేదు కానీ పేరాల్లోకి విభజిస్తూ ఉండండి. గేప్స్ ఉంటే చదవటానికి బాగుంటుంది. మొదట్లో నాకు మరొకరు ఇచ్చిన సలహానే ఇది...:)'
తప్పకుండా మీ సలహా పాటిస్తాను
సుబ్రహ్మణ్యం గారూ కృతజ్ఞతలండీ. అయ్యో, మీతో 'ఏమీ సేతురా లింగా ' అనిపించేసానా.
యీ అవుడియా బాగుందే, మీకు రంగు పడిందని కంఫర్మ్ చేసేస్తే, ఆ కత్తేదో మీ బెటర్ హాఫ్ నుంచి నా బెటర్ హాఫ్ కి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను...
వేణు గారు, కృతజ్ఞతలు. సారీ అండీ, అయ్యొ, అంత రంగు పడేలా చదివించేసానా?
వెంటనే సవరించుకోవాల్సిన విషయమే
అదిరిందీ! మీ ఇంట్లో అందరూ సార్ధకనామధేయులన్నమాట!
జేబీ గారూ కృతజ్ఞతలండీ.
అవునండీ పాపం నేను, శ్యామలక్క తప్ప
ఏంటి ఎన్నెల గారు...సైలెంట్ అయిపోయారు? ఇంకో టపా ఏది? ఫాన్స్ వెయిటింగ్ ఇక్కడా! మీ ఎన్నెల రామాయణం దెబ్బకి నాకు తెలంగాణ యాస తెగ వచ్చేస్తోంది...అలా తెలంగాణాలో మాట్లాడినప్పుడల్లా...'ఎన్నెల రామాయణం...ఎన్నెల రామాయణం' అనుకుంటున్నా!! ఈసారి గోదారి స్లాంగ్ ని ఒక పని పట్టండీ..మా చందుని కొంచెం ఏడిపించొచ్చు :P
ఇందూ గారు,
అయిబాబోయ్ ..రోజుకొక టపా ఎట్టెయ్యాలంటే ఎలాగండీ? ఇషయం ఉండలా ఒద్దా? ఇందూ గారినినడుగుదామంటే దగ్గిర లేరాయే..కంప్యుటరుండాలా?...టయముండాలా?...టాపికుండాలా?...కిస్మిస్ సెలవల్లొ యెట్టాగోట్టా ఎట్టేస్తాలెండి మరి మీ కోసం...ఆయ్
యీ మద్దెన రాం మందిర్ కెళితే, దేవుడి మీద మనసుంటే ఒట్టు...నాక్కూడా మెకంజీ, జానీ ఆంటీ తెగ గుర్తొచ్చేస్తున్నరు..
చాలా చాలా బావుందండీ.... మీలో నిజంగానే ఒక మంచి హాస్య రచయిత్రి ఉన్నారు. మీరు వారిని మెల్లిగా కాకుండా గట్టిగా బయటకు లాగండి. ఇంక మాకు పండగే పండగ.
నిజంగానే మీ పేరు ఎన్నెలా?
మా ఫ్రెండొకడు కారు నలుపుగా ఉండేవాడు. కొంతమంది తెల్లతొక్కలు వాడిని చూసి నువ్వు ఏంటి ఇంత నల్లగా ఉన్నావు అనో, లేక అదేమి కలరబ్బా అనో మిడిసిపడితే వాడనేవాడు " నా నలుపు నీ తలపై ఉంది. నీ తెలుపు నా అరికాలులో ఉంది" అని. నాకెంత ముచ్చటేసిందో ఆ సమాధానం వింటే. బలే చెప్పాడులే అనుకునేదాన్ని. ఆ ఆత్మవిశ్వాసం ఇచ్చే రంగు కన్నా కావలసిన రంగు ఇంకేముంటుంది చెప్పండి.
సౌమ్య గారు కృతజ్ఞతలు. మీ స్నేహితుడు చెప్పిన డైలాగ్ నేను ఫస్ట్ టయిము వింటున్నాను...ఎక్సెల్లెంట్...పేటెంట్స్ ఇస్తాడేమో కనుక్కోండి..ఎక్కడయినా వాడుకుందాం....
ఏంటండీ, మీరు కూడా మా అత్తల్తో కలిసి పోయి నా పేరు 'బొగ్గో, కొరివో' అని మార్చెయ్యాలని కుట్ర పన్నుతున్నరా? మీకూ నచ్చలేదా నా పేరూ?
ఎన్నెల గారు.. సూపర్ గా ఉందండి. నిజానికి మీ రామాయణం పొస్ట్లు చూసాను కాని చదవలేదు. (ఆ యాస అర్ధమవడానికి కొంచెం కష్ట పడాల్సి వచ్చింది. :( :( ) ఈ పొస్ట్ చదివాక అర్జెన్ట్ గా చదివెయ్యాలి అనిపిస్తున్ది :) :).
కానీ ఈ టపా మాత్రం రచ్చరచ్చ చేసారు.. "రంగు పడింది" :) :)
మీ బ్లాగ్ నాల్గవ అనుచరుడిని నేనే :)
నా నలుపు నీ తలపై ఉంది. నీ తెలుపు నా అరికాలులో ఉంది" కెవ్వ్వ్వ్వ్వ్వ్..
పర్లేదండీ ఆ డైలాగు వాడేసుకోండి...తనేమి అనుకోడు.
అయ్యో మీ పేరుని మార్చేయాలని కాదండీ...నిజంగా అసలు పేరు అదేనా, లేక మీరు మాకు కహానీలు చెబుతున్నారా అని...హహహ్హ ఊరికే అన్నాను.
మీ బ్లాగు టెంప్లేట్ మార్చేసారేమిటి? ఇంతకుముందుదే బావుంది. ఇది అంత attractive గా లేదు. ఇంకా కొత్తదేమైనా చూడండి.
వేణూరాం గారు కృతజ్ఞతలండీ...మీకూ సౌమ్య గారిలాగ ఒక పార్ట్ చదవగానే రెండవ పార్ట్ ఈసీ అవుతుందేమో. ...చూద్దాం....
దేవుడా....ఎందుకయ్యా నాకింత మంచి పేరునిచ్చావూ!..సౌమ్య గారు...అలా అనుమానిస్తే ముక్కు పోతుంది..(మీ కళ్ళు మాకందరికీ చాలా చాల అవసరం కాబట్టి, కన్సెషన్). పోనీ ఎన్నెల బదులు వెన్నెల అనుకుందాం......ఇప్పుడు ఓకేనా? హమ్మమ్మా.....నేను కేసెనార్కె గారికి రాసిన కామెంట్ చూసి నన్ననుమానించేసారు కదూ.....ఏం చేస్తాం టయిము బాలేదంతే. అందుకే ఎదో పేజీ విడుతు పెంచుదామనీ గూగుల్ కెళ్ళి తెలిసీ తెలియనివన్నీ రెండు రొజుల పాట్ పరిశొధన చేసీ...ఏం నొక్కానో తెలియదు...నా ఇంద్ర భవునం పాలిపోయింది...మా గురువర్యులకి 'రక్షించండి రక్షించండీ'అని మెస్సేజులు పంపించేసాను......క్షణంలో మల్లీ నా ఇల్లు నా సొంతం అయ్యింది.....త్యాంక్స్ టు జ్యోతి గారు అగైన్....
అక్కో జబర్దస్ట్ గుంది ఈ రంగుల రామాయణం:).మనలో మన మాట మన సీతయ్యకి నలుపంటే ఇష్టమా:) బాగుంది టపా.
భాను గారు కృతజ్ఞతలు.
ఇస్టమా అంటే చెప్పడం కష్టం....ఇష్టమయితే ఇన్ని కష్టాలెందుకు చెప్పండీ......కష్టం లోనే ఇష్టాన్ని వెతుక్కోవాలి మరి ...ఏదో, పాపం ఎడ్జస్ట్మెంటు.
ఏమైందండీ? హెల్ప్ హెల్ప్ అన్నారూ?
ఏమైందండీ? హెల్ప్ హెల్ప్ అన్నారూ?
Indu gaaru thanks a lot.
Last night, I thought of increasing the page width and read some articles from google and followed some steps..unfortunately, those steps changed my template completely and I lost all the gifts Jyoti garu provided on my blog...i was panic and remembered you and jyoti garu...
jyoti garu fixed the problem this morning..thanks to her..
సారీ ఎన్నెలగారు..మీరు అడిగిన వెంటనే నేను హెల్ప్ చెయలేకపోయా! నేను ఇవాళ పొద్దునే మీ కమెంట్ చూసా! వెంటనే కామెంట్ పెట్టా! సారీ అండీ :(
Vennela garu.. Super oo Super.. intha lengthy kadhalu ela rastharu andi..:)
Ivvala mee blog lo Andhralo mamaya - two parts, Holeveen , Rangupadddhi chadiva.. Nestam akka la meeda oka different style.chala unique ga vundi mee way of writing.:)
sadi dhar gaaru kritajnatalandee...
sorry andee... annee okka saari cheppeyyalani taapatrayam+ lectures danche alavaatu= pedda tapaalu .tagginchadaaniki try chestoo, mottham wraayadam maanestunaa..takkuva wraayadam raavatledu...hahaha
Ammo, Nestam gaarito comparision!nenu mallee dhaamm(ilaa appudappudu flat ayipotuntaa..meeru khangaaru padakande!).
meeru kshamapanalu, Sorrylu tega adegesthunnaru andi.
nestam akka ante.. naaku aa akka blogs ante chala istam.. so evarivi nacchina akka blog tho polustha anna mata. Inka meeru kooda naa peru chivaran garelu..poornalu teesthey bavuntundhi ani naa manavi..
Chakkaga Sasi ani pilavandi chalu.
manalo mana mata meeru easy ga flat avutharu anukunta.. sare inko sari try chestha.. ennela garu sardhaka namadeyulu. :)
hahaha Sasi..chaala baagundi..naa brotherhood lo oka sasi unnaadu...so mimmalni kuda ala pilustaalendi ..naakoke...
thanks andee...ala polchinanduku
abba..cheppaakaa kudaa mallee flat avutaanentee...marade...ammani andukegaa andaru tittindee...total family antaa saardhaka naamadheyule....hahaha!!!
Ennela garu, thammudi ga bavinchinanduku thanks :) ika nunchi alage pilvandi :)
Post a Comment