మా ఊళ్ళో హాలొవీన్

Thursday, December 23, 2010

మా మార్లీన్ మొన్న ఒకటే నొచ్చుకుంటూ కనిపించింది. ఏంటా అని ఆరా తీస్తే హాలొవీన్  డే నాడు కొన్న  చాకొలేట్లన్నీ అలాగే ఉండిపొయ్యాయిట...చాల బాధ పడిపోయింది.'నీకు తెలుసా మా చిన్నప్పుడయితే హాలొవీన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం, బోల్డు కొనేసాను చాలామంది పిల్లలోస్తారని , ఇద్దరంటే ఇద్దరు వచ్చారంతే 'అని చెప్పింది...నాకు యేదొ ఓదారుద్దామనిపించి..'"పొనీలే మార్లీన్, మన చిన్నప్పుడంటే మన పేరెంట్స్ యెక్కువ కొనిచ్చేవారు కాదు కాబట్టి మనకి ఏందొరుకుతాయా అని చూసేవాళ్ళం, ఇప్పుడు పిల్లలకి ఆ అవసరం ఏముందీ అన్నీ పేరెంట్స్ కొనిచ్చేస్తారుగా అడగ్గానే "అన్నాను..ఆ ఎక్సప్లనేషన్ కి ఆవిడ అద్దిరిపోయి( ఇక్కడందరూ ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు నిజ్జమా కాదా నాకు అర్థం కాదు...అర్థం చేసుకునే ప్రయత్నం అవసరమంటారా?) ..."అవును నిజమే, నాకు పిల్లలు లేరుగా అందుకే ఇలాంటి  థాట్స్ రాలేదు " అని కళ్ళు తుడుచుకుంది....వెంటనే తేరుకుని, "అవును ఎన్నెలా,  మీ ఊరిలో కూడా హాలొవీన్ జరుపుకుంటారా? పిల్లలకి ఫ్రీ ఫుడ్ పంచుతారా " అని అడిగింది......ఇక్కడ అక్టోబర్ చివరన హాలోవీన్ పండుగ జరుపుకుంటారు. నాకు తెలిసీ దీన్ని మనం ఆల్ సెయింట్స్ డే అనీ, ఆల్ సోల్స్ డే అనీ, మా ఊర్లో అయితే ముద్దుగా "బొందల పండుగ"నీ పిలుచుకుంటాము. విశేషమేంటంటె సాయంత్రం పిల్లలందరూ అందంగా  సీతాకోక చిలుకల్లగా, దేవ దూతల్లగ, ఇంకా మంచి మంచి మెరిసిపోయే దుస్తులు వేసుకుని అందరిళ్ళకీ వెళతారు. అందరూ దీపాలు వెలిగించి(ఎలట్రిక్ వే లెండి),పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ టయిముకల్లా కంపెనీలు చిన్న చిన్న చాకొలేట్ ప్యాకెట్లూ, చిప్స్ ప్యాకెట్లు అవీ ప్రత్యేకంగా తయారుచేస్తారు. పిల్లలు ప్రతి ఇంటికీ వెళ్ళి 'ట్రిక్ ఆర్ ట్రీట్' అని అడుగుతారు. ఇంటి వాళ్ళు 'ట్రిక్కులోద్దు బాబోయ్ ట్రీట్లు ఇవిగో ' అని  కొని ఉంచిన చాకొలేట్లో, చిప్సో, ఇంకా యేవయిన తినుబండారాలో వాళ్ళ బాగ్ లొ వేస్తారు...ఇలా పిల్లలు ఇంటింటికీ వెళ్ళి చాలా  రోజులకి సరిపడా తినుబండారాలు పోగేసుకుంటారు... కల్లెక్ట్ చేసే వరకూ ఓకే... తరువాత మాత్రం, పళ్ళు పుచ్చిపోతాయనీ, అందరూ మంచివస్తువులు ఇస్తారో లేదొ అనీ అందరు తల్లులకీ కొంచెం సందేహాలు...దాంతొ...ఆ దండుకొచ్చిన పదార్థాలన్నీ మరునాడు ఆఫీసులకి తీసుకొచ్చి పడేస్తుంటారు....మరి నాకేంగుర్తొచ్చాయంటే ...


మాదొక చల్లని ఊరు. నాలుగు వందల సంవత్సరాల పూర్వం ఎప్పుడో  ఒక ముని  తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి వెలసిన ఊరు. చిన్న తిరుపతి లేక్కన్నట్టు. మా వెంకన్నకి డిసెంబరులొ బ్రహ్మోత్సవాలు జాతర....అబ్బో సందడే సందడి.ఆ పది రోజులు అస్సలు ఇంట్లో ఉండేది లేదు. యెవరు జాతరకి వచ్చినా, తెలిసున్నచిన్న పిల్లలు  కనిపిస్తే గాజులొ, మరమరాలో, చిన్న బొమ్మలో కొనియ్యడం ఆనవాయితీ. ఇంక మనకి పండగే మరి...ప్రతి ఒక్కరూ ఊరిలో తెలిసున్న వారే..అందునా మనమంటే కుంచెం ఎక్కువ ఇష్టం ఎందుకో.... చెల్లీ నేనూ ఇద్దరం ఆ పది రోజులూ నిద్ర పొవడానికి తప్ప ఇంటికెళితేనా!మద్యాహ్నానికల్లా   గుర్రాలు, చిన్న రంగుల రాట్నం ,పెద్ద తోట్టెల (పెద్ద రంగుల రాట్నం) దగ్గర పడిగాపులు . చిన్న రంగుల రాట్నం (మెర్రీ గో రవుండ్ ) నాట్ ఎట్ ఆల్  ఇంటెరెస్టింగ్, ఎందుకంటేచాలాసార్లు ఖాళీగా  ఉండెది.మనం ఎప్పుడు  కావాలంటే అప్పుడు  గబుక్కున ఎక్కచ్చు...ఇంకా అమ్మ ప్రతి రోజూ చిన్న రంగుల రాట్నం కి డబ్బులు ఇచ్చేది...అస్సలు సంగతంతా పెద్ద ఉయ్యలలో ఉంది.."అది చాలా ఖరీదు.. మీరు చిన్న పిల్లలు....చక్క రొస్తదీ, ఎక్కద్దు  "అని అందరూ చెప్పేసే వారు...మరి  ఒద్దు అన్న వాటిమీదే కదండీ మక్కువంతా ....నాలుగు ఉయ్యాలల్లో .మూడు ఉయ్యాలలు నిండే వరకే మా వెయిటింగు  అంతా.. .ఆ మూడో ఉయ్యాల నిండే వరకు ఎక్కడైనా ఆడుకోవచ్చు...ఒక్కొక్క ఉయ్యాల నిండుతుంతే  దాన్ని పయికి పంపించి ఖాళీ  ఉయ్యాల కింద ఉంచి జనాల కోసం ఎదురు చూస్తూ  ఉండేవాడు దాని ఓనర్...మూడు ఉయ్యాలలు నిండే వరకు అందరికీ ఎక్కడ లేని ఓర్పు...ఆ తర్వాతా పయిన ఉన్నవాళ్ళు ఇగ కానీ భై పోవాల అంటు ఉండేవారు..కానీ నాలుగు ఉయ్యాలలు నిండకపోతే బ్యాలన్స్ అవదని అనుకుంట ,అప్పటికి రీజన్లు లాజిక్లూ తెలియవు...ఓన్లీ గోల్ ఈస్ ..మూడు ఉయ్యాలలు నిండే టైముకి అక్కడున్డాలి ...నాలుగో ఉయ్యాలలో ఇంక బతిమాలి మరీ ఫ్రీగా ఎక్కించుకుంటాడు... అప్పుడప్పుడు మనం "నాకు భయ్యం నేను రాను "అనాలన్నమాట.. అతను...రాండ్రి  తల్లీ మా అమ్మలు  గదూ,జోర్గ తిప్పనులే అని సముదాయించి మరీ అందరినీ యెక్కిస్తాడు..మనసులో మస్త్ సంతోషం.. బయటికి మాత్రం భయ్యం...రోజూ ఇదే సీను.....  యీ జాతర సంగతి అటుంచితే..పిల్లల్లేని ప్రతపరెడ్డి మాస్టారు ప్రతి సోమవారం పిల్లలందరికీ పిప్పరమెంట్లు పంచేవారు...సొ మండే సాయంత్రం అక్కడ హాజరు.... రామిరెడ్డి తాతకి చాలా పొలాలు అవీ ఉన్నాయి... వాళ్ళకి చిక్కుళ్ళు బాగా పండేవి....ప్రతి శుక్రవారం పెద్ద గుండిగతో గుడాలు (గుగ్గిళ్ళూ) ఉడికించి పిల్లలందరికీ పంచేవారు....ఫ్రయిడే  సాయంత్రం నుంచీ అక్కడే మకాం... మరి లలితత్త నాకు రెండు చేతులూ పట్టమని, పట్టినన్ని గుడాలు పెట్టేది..అప్పుడప్పుడు గవును పట్టమని ఒడి నిండా పోసేది .అక్కడే అందరం గోడ పక్కన కూచుని మట్టి చేతులు అవీ ఇవీ ఆలోచించకుండా బొజ్జ నిండా తినేవాళ్ళం .శనివారం మా వెంకన్నకి భోగం...అక్కడ దద్యోజనం లేదా పులిహోర ప్రసాదం...ఇక్కడ ప్రసాదం గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి...మా పెద్ద పూజారి గారు....రాఘవాచారి మామ...యీయన చాలా ఫేమస్, యెందుకంటారా...గుప్పెడు పులిహార ఇచ్చి పంచమంటే, ప్రపంచం మొత్తం  పంచి ఇంకా చిటికెడు మిగులుస్తాడని ప్రతి ఒక్కరూ చెప్పుకునేవారు... సొ, షాట్  కట్ గా యెప్పుడయిన యెవరింట్లోనయిన తక్కువ ఖర్చుతో యెక్కువ మందికి భోజనాలవీ పెట్టాలంటె, మా రాఘవాచారి మామని అధ్యక్షుడుగా ఉంచిటే సరి.ఆయన ప్రసాదం పెట్టే తీరు గుర్తొస్తే చాల నవ్వొస్తుంది.. ఒకొక్క మెతుకు అందరి చేతిలో విదుపుతున్నత్తు పెట్టేవారు..విసుగు కూడా చాల ఎక్కువ...ఇంకా ప్రసాదం తీసుకోగానే ఇంటికొచ్చేస్తామా ఏంటి?. మా లల్లీ, విజ్జీ, గవురీలతో గుడి చుట్టూ ఉన్న దేవిడీ ల పయికి మెట్ల మీంచి వెళ్ళి కిందకి వాలిన చింత చెట్ల కున్న కాయలు కోసుకోవాలి...అక్కడ గస్తీ తిరిగే మల్లన్న తాతకి కనపడకుండా మెట్లు దిగి రావాలి...మెట్లు అస్సలే బహు పురాతనమయినవి...మధ్యలో ఉండగా  తాత అరిచాడంటే, మన గుండె ఆగిపోవడమో, జారి పడడమో తధ్యం...మరి హోలీ వచ్చిందంటే, నాకు గుర్తుండీ యెవ్వరూ ఫ్రీగా రంగు జల్లేవారు కాదు...రంగు జల్లి మెడలో మిఠాయిల దండ వేసేవారు... సో, ఎంత మంది రంగు జల్లితే, మనకి అంత మంచిదన్నమాట.రాఖీ పండక్కి అన్నయ్యలే కాకుండా అన్నయ్యల ఫ్రెండ్స్ అందరూ ఇంటికొచ్చి రాఖీలు కట్టించుకుని స్వీట్శ్, డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు ..అబ్బే, ఇందులో మన స్వార్థం యేమీ లేదండీ, వాళ్ళకి చేతికి ఎన్ని రాఖీలుంటే అంత 'ఇజ్జత్' అన్నమాట. మరి అన్నలు కదా! కట్టమంటే కట్టేస్తాం అంతే.అంతేనా, ఇస్కూల్లో పెద్ద పెట్టెల్లో నెలకొక సారి వేఫర్లు వచ్చేవి.(అప్పటికి వాటి పేరు తెలియదు)   అందరికీ పంచేవారు మధ్యాహ్నానికాల్లా.ఇంక శ్రీరామ నవమి..ప్రతిరోజూ పొద్దున్న పూజలు-ప్రసాదాలు, చలువ పందిళ్ళు ..అక్కడ పగలంతా నాలుగ్గుంజలాటలు(నాలుగు స్నంభాలాటలు)..దాగుడు మూతలు.సాయంత్రం అవ్వంగానే ఏదొ ఒక ప్రోగ్రాం..ప్రోగ్రాం సంగతి అటుంచితే..ప్రసాదం ఇంపార్టెంట్ ఇక్కడ...ఇంక పదవ రోజు కళ్యాణం. మరీ చిన్నప్పుడు అందరికీ బొట్లు పెట్టడాలూ,కొంచెం పెద్దయ్యాక కొబ్బరి కోరడానికి సహాయం..వీటి  వెనుక కమ్మని,వడపప్పు తీయని  పానకం, గుడి  వెనక  అందరికీ భోజనాలు.నాకు చాలా ఇష్టంగా గుర్తు తెచ్చుకునే చిరు తిళ్ళు  రెండు....ఒకటి బర్ఫీ...మీ పాల బర్ఫీ కాదండోయ్. పెద్ద ఐసు ముక్క బండి మీద పెట్టుకుని దాన్ని చిద్రిక పట్టి , పుల్లకి పెట్టి ఎర్ర రంగు చల్లి ఇచ్చేవాడు....రంగు గబా గబా పీల్చేసి 'అన్నా  కొంచెం రంగేయ్యవా'  అంటే మళ్ళీ వేసేవాడు...మన పుల్లకున్న ఐసు అయిపోయేవరకు 'అన్న కొంచెం రంగేయ్యవా ' అన్టూ  ఆ బండితో ఎంత దూరమయినా  ప్రయాణించటం తరవాత పరిగెత్తుకొంటూ ఇంటికి రావడం..చాల థ్రిల్లింగ్...రెండవది బొంబాయి మిటాయి ..చెక్కర పాకం లో పింక్ కలర్ వేసి, ఆ ముదురు  పాకాన్ని ఒక కర్రకి చుట్టి భుజం మీద పెట్టుకునీ వచ్చేవాడు...దానితో ఉంగరం, గడియారం/ గాజు  చేసి చేతికి పెట్టేవాడు.  అవి చూసుకుని, మురుసుకున్నంత సేపు మురుసుకుని తరవాత  చటక్కుని తినేయ్యడమే తియ్యగా. ఎన్టీ ,మా సీతయ్యలా  మొహం వెగటుగా పెట్టి చూస్తున్నారా , అబ్బా ఈగలు వాలవా,  మూత పెట్టడు కదా దుమ్ము పడదా -యాక్తూ అంటున్నారా  ? హూ కేర్స్...దాంట్లో మజా మీకేం తెలుసండీ తింటే కదా తెసుస్తుంది...మరి అన్నిటికంటే నాకు ఇష్టమైన జ్ఞాపకాలు రెండు..ఒకటి..మా గొల్లోళ్ళ రామచందరన్నకి పెళ్ళయ్యింది...కొంచెం ఘోషా టయిపులో కొన్నాళ్ళ వరకు వదినమ్మ బయటికి వచ్చేది కాదు..అన్నదమ్ములవి పది కుటుంబాలు కలిసి ఒకే లోగిల్లో ఉండేవి అందుకని కొత్త కోడళ్ళు కొన్నాళ్ళు బయటికి రారు.   రాంచందర్ అన్నకి వదిన మీద చాల చాల జాలి వేసేదేమో..లోపల ఒక్క దానికే  బోర్ కొడుతుందని...నన్ను పిలిచి..'ఎన్నెల ఒదిన తోని మాట్లాడు పో చెల్లె 'అని పంపించేవాడు...నేను చాల గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని... వదిన మారెడ్‌పల్లి అనే పెద్ద సిటీ  నించి వచ్చిందని అందరూ చెప్పుకునేవారు...చేతికి దండ కడియాలు  , చెవులకి మకర కుందనాలు  కాళ్ళకి  మెరిసి  పోతున్న పట్ట గొలుసులు పెట్టుకున్న ఆమె అంటే నాకు హీరోఇన్ లెక్క....మరి వదిన కి నేను పెద్ద కాలక్షేపం బఠానీ...సాయంత్రం వరకూ కూచోపెట్టుకునిపాటలు పాడించుకునీ, పద్యాలు చదివించుకునీ...అందరి గురించీ అమాయకంగా నేను చెప్పేవన్నీ ఇంటరెస్ట్‌గా విని పెట్టడమే కాక, నాకు తినడానికి వాళ్ళ పుట్టింటినుంచి తెచ్చిన మురుకులు, గర్జలూ..ఓడప్పలూ పెట్టేది... వదిన దగ్గర నించి నేను బయటికి వచ్చాక అందరికీ నన్ను చూసి అడ్మిరేషన్..నేను "హేమా మాలిని " దగ్గరుండి వచ్చినట్టు ..అదే కదా మనకు కావలసిన ఫీలింగ్...రెండవది   ... మా గోపాల్ సేట్ దుక్నం ...సాయంత్రం అవ్వంగానే లైట్ వేసి పిల్లలందరికీ పిలిచి బెల్లం ముక్కలు పెడతాడు... అమ్మకి తెలుస్తే కోప్పడుతుంది అలా  తీసుకున్నందుకు... ఆక్చువల్ గా రామ్‌రెడ్డి తాత ఇంట్లొ గుడాలు కూడా అమ్మకి నచ్చవు వాళ్ళు ఆవులకి దిస్టి తీసి వండుతారేమోనని అమ్మకి పెద్ద అనుమానం.... అందుకని శుక్రవారం సాయంత్రాలు మమ్మల్ని బయటికి వెల్లనిచ్చేది   కాదు..కానీ ఆ టయిముకి ఎలాగోలా జారుకోవడం పెద్ద విద్య యేమీ కాదు ... బయటికి వెళ్ళినా గుడాలు మాత్రం తీసుకోమని ఒట్టేసి మరీ చెప్పేస్తాముగా....మరి చీకటి పడే సమయానికి మనకి గోపాల్ సేట్ దుక్నం దగ్గర ఏదో ఒక పని ఉంటుంది అర్జెంట్‌గా... అంతగా లేకపొతే మధ్యాహ్నమనగా అమ్మగానీ పక్కింటి ఆదిలక్ష్మి అత్తమ్మ గానీ  ఉప్పు , చాక్పత్తీ , కాప్పొడి యేం తెమ్మన్నా  అప్పడి దాకా చేసి ఆ సమయానికి వెళ్ళచ్చు....అవేమీ లేకపోతే కనీసం పంచాయతీ ఆఫీసు వాళ్ళు  పొలం పనులు ,వార్తలు వేస్తారు కదా, మాస్టారు గారు విని రమ్మన్నారు  అని చెప్పి వెళ్ళడమే.  అమ్మకి తెలుసేమొ,మేము ఎందుకు వెళతామో!పాపం తెలిసినా తెలియనట్టుండేది..ఇంకా వెంకన్న గుడి పక్కనే ఉన్న పాండురంగడి గుడిలో పూజలు, జగన్నాధస్వామి గుడిలో  మొలకల రధం పండుగ..దసరా పండక్కి జమ్మి పంచుకోవడం , పలారం బండ్లు...గనేశ్ చవితి ..డుప్కీ పున్నమికి గుండంలో స్నానాలు, ప్రసాదాలు , శివరాత్రి మర్నాడు శివుడి గుళ్ళో భోజనాలు,బతకమ్మ పండుగ , అక్కడ పంచుకునే  సద్దులు ..ఇలా ఒక్క హాలోవీన్ ఏంటండీ...నాకు ప్రతి రోజూ పండగే....ఇలాంటి హాలోవీన్లు, జ్ఞాపకాలు    మీకూ ఉన్నాయా ?...

20 వ్యాఖ్యలు:

ఇందు said...

వావ్! అసలు పల్లెటూరి పండగ వాతావరణం అలా కళ్ళముందు ఉంచేసారుగా! నాకు బహలె నచ్చింది ఈ టపా! బోలెడన్ని మిఠాయిలు...ప్రసాదాలూ...పండగ హడావిడులు....ఒక్కసారి నాకు అలా అలా మీ ఊళ్ళో తిరుగుతున్నట్టు అనిపించింది. ఎన్నెల గారు మీకు హాట్సాఫ్ :)
>>'అన్నా కొంచెం రంగేయ్యవా' హ్హహ్హహ్హ నాకు ఈ డైలాగ్ భలే నచ్చిందీ.నిజం చెప్పలంటే నేను ఈ బర్ఫి..అలగే ఆ బొంబాయ్ మిఠాయి కనీసం చూడను కూడా చూడలేదు.....ఇప్పుడు మీ ద్వారా నా ఊహల్లో వాటికి ఒక రూపం ఇచ్చా!
మీరు ఇలా తియ్య తియ్యగా మిఠాయిపొట్లం విప్పుతున్నట్టు కబుర్లు చెబుతుంటే..అలగే వినబుధ్ధేస్తోంది :)

Anonymous said...

మీ పండగల ముచ్చట్లు బాగున్నాయండి

తృష్ణ said...

మాకూ బోలెడు జ్ఞాపకాలు...మనసు కలవరపడినప్పుడు ఊరట కలిగించేవి ఈ జ్ఞాపకాలే కదండి.
'హలోవీన్' గురించి మా తమ్ముడు అమ్రికాలో ఉన్నప్పుడు చెప్తూండేవాడు.ఈ టపాకు 'పండుగలు - జ్ఞాపకాలు' అని పేరెట్టాల్సిందండి.

kiran said...

హహహ...ఎన్నెల గారు..:D :D ...

భలే నవ్వుకున్నానండి..కొన్ని..కొన్ని..చోట్ల గట్టిగ నవ్వేస..రూం లో ఉన్న కాబట్టి సరిపోయింది..:D ...

మా ఊర్లో అయితే ముద్దుగా "బొందల పండుగ"నీ పిలుచుకుంటాము :D ...ఇది అక్కడి వాళ్ళకు చెప్పండి..:D

భాను said...

అబ్బ ఎన్ని జ్ఞాపకాలు కళ్ళ ముందుంచారు. గుడాలు. బర్ఫీ, బొంబాయి మిటాయి మీ టపా చదువుతుంటే నోరూరుతుంది. మా ఊళ్ళో బొబ్బదాలు అని సాయంత్రం దొరుకున్తున్దేవి అయిదు పైసలిస్తే అయిదు వచ్చేవి , రోజూ వెళ్లి తినాల్సిందే:) పుల్ల ఐస్ క్రీం మర్చిపోయినట్టుంది నాకయితే ఇప్పటికి అప్పుడప్పుడు సరదాగా తింటుంటా...మీ పండగలూ చిన్నప్పటి జ్ఞాపకాలు బాగున్నాయి. మిగతావి ఆ చివర్లో చెప్పినవీ ఇంకో టపా రాసెయ్యండి మరి.

Ennela said...

ఇందు గారు , కృతజ్ఞతలండీ,
మా ఊరు చాల బాగుండేది....ఇప్పుడు కొంచెం మారిపోయింది లెండి...
మీరు బర్ఫి ఇంట్లో చేసుకోవచ్చు...అయిస్ క్యూబ్స్ బ్లెండర్లో క్రష్ చేసి, దాన్ని గట్టిగా నొక్కి, పుల్లకి గుచ్చ్చి రస్న కాని, మాజా కాని లేకపొతే కోక్ కానీ చల్లుకోవడమే....అయితే ఒక చెయ్యితో ' అన్న రంగెయ్యవా 'అని అడిగి,ఇంకో చేత్తొ రంగు జల్లుకోవాలన్నమాట....నయాగరా దాటి కెనడాకొచ్చేస్తే నేను చేసిపెడతానన్నమాట....


అను గారు, కృతజ్ఞతలండీ

తృష్ణ గారు, కృతజ్ఞతలు....అవునండీ పేరు కొంచెం 'బడతడిందీ....సారీ, తడబడిందీ'. మరి మార్లీన్ ఫ్రీ ఫుడ్ గురించి అడిగితే ఇవన్నీ చెప్పాను కదా....అలా హాలోవీన్ అని ఫిక్స్ అయిపోయాను....ఇప్పటినుంచీ..పేరు కొంచెం అలోచించి పెడతాను....సజెషన్ కి కృతజ్ఞతలు


కిరణ్ గారు కృతజ్ఞతలండీ, 'బొందల పండగ" అని అంటామని చెప్పేసానండీ,కానీ ట్రాన్స్లేషన్ బాగా కుదరలేదు....'గ్రేవ్ ఫెస్టివల్,,, గ్రేవ్‌యార్డ్ ఫెస్టివల్ ' అంటారని చెప్పాను. అదే అద్దిరిపోయే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు......ఈ దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్స్ నాకూ వచ్చేస్తున్నయ్ బాబోయ్...బచావో.....

భాను గారూ కృతజ్ఞతలు. నేను ఎక్స్పెక్ట్ చేసా మీకివన్నీ తెలుసని, పుల్ల అయిసు రాయలేదండీ అందరికీ తెలుసుకదా అని...మీ బొబ్బడాల గురించీ వ్రాసేయండి మరి జెల్దీ...కొత్త కదా కుంచెం కంఫ్యూషన్ గా ఉంది.......అన్నీ ఒక టపాలో పెట్టెయ్యాలని తాపత్రయం,టపా పెద్దదయిపోతుందని 'భయ్యం'..అదీ సంగతి...

ఇందు said...

హ్హహ్హహ్హ! అప్పుడు..'ఎన్నెలా రంగెయ్యవా?' అని మిమ్మల్ని అడగొచ్చన్నమాట :))

Ennela said...

అవును, బండి వెనకాల 'ఎంతెంత దూరం చాలా చాలా దూరం 'వెళ్ళక్కరలేదు....ఎన్ని సార్లయినా వేస్తాను ఓపిగ్గా...అబ్బో నాకెంత ఇష్టమనుకున్నరూ యీ జ్ఞాపకం!

మంచు said...

:-) చిన్నప్పటి జ్ఞాపకాలు తలచుకొవడం తొ పాటు మిగతా వాళ్ళతొ పంచుకొవడం ఇంకా బాగుంటుంది.,,, బాగా రాసారు :-))

ఇందూ గారు : బొంబాయ్ మిఠాయి అంటే జీళ్ళు చెస్తారు కదా.... అల్మొస్ట్ అదే పాకం... అది కొద్ది సాఫ్ట్ గా ఉండటం తొ దాంతొ వాచ్ షేప్ చేసి అమ్మేవాడు మాకు .......

Ennela said...

మంచు గారు, కృతజ్ఞతలు.... మీకూ తెలుసా బొంబాయి మిటాయి? నాకు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది.
మీ సలహా పాటించడానికి ప్రయత్నిస్తాను. కంప్యుటర్ చాలా కొద్ది సెపే దొరుకుతుందండీ..అనుకున్నది తొందరగా వ్రాసేయాలని ఖంగారు.
మా శతృఘ్నుడు మంచి ఆర్టిస్ట్....నా రామాయణం చదివి , బొమ్మలేసి పెడతానని ప్రామిస్ చేసాడు....పాపం చాల బిజీ ఇండియలొ....'టయిము చూసుకుని వెయ్యి తొందరేమీ లేదు 'అని చెప్పాను.

బులుసు సుబ్రహ్మణ్యం said...

పీచు మిఠాయి, జీళ్ళు, బల్లిగుడ్డులు(మా కాలంలోని Gems అన్నమాట)ఇవన్నీ కొనుక్కొని తినడం, వాటిని కొనుక్కోవడానికి ఓ అర్ధణా కానీ ఓ అణా కానీ సంపాయించడానికి పడే కష్టాలు, చాలా మధురమైన జ్నాపకాలు. ఒక బేడ అంటే రెండు అణాలూ, సంపాదిస్తే ఏదో ఘన కార్యం సాధించిన ఫీలింగ్. ఓహ్ తలుచుకొంటేనే నోరు ఉరిపోతోంది.
నైస్ పోస్ట్. బాగా వ్రాసారు.

మంచు said...

తెలీక పొవడం ఎమిటండీ :-) నాకు రంగుల రాట్నం ఎక్కితే కళ్ళు తిరుగుతాయ్...ఎత్తునుండి చూస్తే భయం :-) ఎంత భయం అంటే పారిస్ లొ ఉన్న ఫామస్ La Grande Roue ఎక్కడానికి కూడా దైర్యం చెయ్యలేదు. మీరు చెప్పిన బర్ఫీ కూడా ఉంటుంది కానీ దాని పేరు వెరే....గుర్తులేదు... ఈ బొంబాయ్ మిఠాయ్ కి కూడా వేరే పేరు ఉంది. వీటికి మా వైపు వాడే పేర్లు కావాలంటే రాధిక (నాని) గారిని అడగాల్సిందే ....

ఇందు said...

ఎన్నెల గారు..మీరెంత మంచివారు! ఎన్నిసార్లయిన్న వేసిపెడతారా!Choo chweet :)

మంచుగారు! జీళ్ళు తెలుసండీ...కానీ ఈ బొంబాయి మిఠాయి తెలీదు. హ్మ్! ఈసారి మా అమ్మమ్మగారి ఊరెళితేనో....మా చందుగారి సొంతూరు (మీ గోదావరే!) వెళితేనో దొరుకుతుందేమో చూస్తా :)

Ennela said...

సుబ్రహ్మణ్యం గారు , కృతజ్ఞతలు..అవును బల్లి గుడ్లు..పీచు మిటాయి, జీళ్ళు వీటి రుచికి ఇప్పుడు దొరికేవేవీ సాటి రావు. ఇంకా మాకు 'పాన్ బీడా అని చిన్న ఎర్ర రంగు జీళ్ళ లాంటివి దొరికేవి....పయిన నువ్వులుండవు....జీళ్ళ పాకంలోనే రెడ్ కలర్.....అది తింటే నొరంతా....రెడ్ రెడ్ రెడ్ ..అందుకే పేరు 'పాన్ బీడా...హహహహ్
మంచు గారికి తెలుసేమో....ఇందు గారు ఇది కూడా మిస్స్ అయ్యరా మీరు? చెపితే దీని రెసిపీ కుడా తెలుసుకునీ చేసుకుందాం....బొంబాయి మిటాయి రావట్లెదనుకుంటానండీ, ఎక్కడా చూడలేదు మళ్ళీ

అశోక్ పాపాయి said...

మీ ఊరు గురించి మీ వర్ణన బాగుంది...రంగుపడుద్ది అనే టపా ఇంక బాగుందండి.

రాధిక(నాని ) said...

ఎన్నెల గారు ,మీ ఊరి జ్ఞాపకాలు ,మీ చిన్నప్పటి విషయాలు చెపుతూ మీ ఊళ్ళో కాసేపు అలా తిప్పేశారు.మా వైపు బొంబాయి మిటాయిని పీచుమిటాయి అంటాము.బర్ఫిని పుల్లైసు అంటాము.ఇప్పుడు ఈరెండు మా ఉరికి అమ్మడానికి రావడం లేదు.రోజులు మారాయి కదండి! లేసు,కుర్కురేలు వంటివి వచ్చాక ఇటువంటివి చాలా రావడం లేదు.. .
.

వేణూశ్రీకాంత్ said...

బాగా రాసారండి.. చాలా బాగుంది టపా. ఎన్నెన్ని ఙ్ఞాపకాలో...

Ennela said...

అశోక్ గారు, కృతజ్ఞతలు. మీ బ్లాగుపయి ఒక లూక్కేసా...చాలా బాగుంది..
రాధిక గారు...మీకు 'నూరు టపాల 'శుభాకాంక్షలు.
వేణూ గారు...కృతజ్ఞతలండీ....ఎంత ఇష్టమయినవో అవన్నీ...ఇన్ని రోజులు తలచు కుంటూ ఉండేదాన్ని....ఇప్పుడు చదువుకుంటూ ఉండొచ్చు....హహహహ

జ్యోతి said...

బాగా రాసారు ఎన్నెల గారు. నాకూ బొంబాయి మిఠాయి చేతికి వాచ్ కట్టించుకొని తినడం చాలా ఇష్టంగా ఉండేది చిన్నప్పుడు.
రాధిక(నాని )గారు-పీచు మిఠాయి అంటే వేరే కదా, అది మబ్బుల్లాగా ఫ్లఫ్ఫీ గా ఉంటుంది. ఇదేమో తీగ లాగా ఉండి షేప్స్ చెయ్యడానికి వీలుగా ఉంటుంది.

Ennela said...

Mahek గారు కృతజ్ఞతలండీ, నాకు ఇంకొక బొంబాయి మిఠాయి నేస్తం దొరికారన్నమాట...హ్యాప్పీ....

నూతన సంవత్సర శుభాకాంక్షలండీ